నమస్తేతెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 14: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మహాలక్ష్మి పథకంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని రద్దు చేయాలని, లేకుంటే తమకు ఉపాధి చూపాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మంగపేట మండల కేంద్రంలో నిరసన ర్యాలీ తీశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జీవన భృతి కింద నెలకు రూ.పదివేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆటోలను నిలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ), లక్ష్మణచాంద, భైంసా మండల కేంద్రాల్లో రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. తమ ఉపాధిపై దెబ్బ కొట్టేలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఆటో యూనియన్ మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి ఆటో డ్రైవర్లు తరలి వచ్చి రాస్తారోకో చేశారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో మేడిపల్లి ఆటో, టాటా మ్యాజిక్ అసోసియేషన్ సభ్యులు ధర్నా చేశారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్స్ ద్వారా అప్పు తీసుకొని ఆటోలు కొనుక్కున్నామని, ప్రతి నెలా కిస్తీలు ఎట్లా కట్టేదని ప్రశ్నించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆయా మండలాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.