హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ )/సుల్తాన్‌బజార్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద శనివారం ఆటో డ్రైవర్లు నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంతకుముందు ఇన్ఫార్మల్ లేబర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. 2 గంటలపాటు రోడ్డుపై ఆటోలు నిలిపి చౌరస్తాను దిగ్బంధించారు.
తమ డిమాండ్లు పరిష్కరించేదాకా పోరాడుతామని గొంతెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సర్కార్ స్పందించడం లేదని, ఏటా రూ.12వేలు ఇస్తామని మాట తప్పిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, పోలీసులు అతనిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆటో యూనియన్ నాయకుడు మీర్ ఇలాయత్ అలీ మాట్లాడారు.