హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహాధర్నా నిర్వహించబోతున్నట్టు బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. అనేక ఆంక్షల మధ్య పోలీసులు మహాధర్నాకు అనుమతిచ్చినట్టు చెప్పారు. 200 మందికి మించకుడా ధర్నా చేపట్టాలని సూచించినట్టు చెప్పారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు.. ఆటోడ్రైవర్ల సమస్యలు చెప్పుకునేందుకు ధర్నా చేపడితే డ్రైవర్లు పరిమిత సంఖ్యలో రావాలని సూచించడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపాధి కరువై ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం దుర్మార్గమని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఏడాదికి రూ.12 వేలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.