ఎల్లారెడ్డిపేట/ జగిత్యాల కలెక్టరేట్, మే12 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆటోలు సరిగ్గా నడువక.. ఆర్థిక సమస్యలు చుట్టిముట్టి మనస్తాపంతో ప్రాణా లు తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఒకరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన దారంగుల రాజు (30), జగిత్యాలకు చెందిన అఖిలను ఐదేండ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి జగిత్యాలలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆటో సక్రమంగా నడువక పోవడంతో భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైన విషయాలపై మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో నాలుగేండ్ల కొడుకొని తీసుకొని భార్య వారంక్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో రాజు తీవ్ర మనస్తాపం చెంది ఆదివారం అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకొన్నాడు.
సోమవారం రాజు స్నేహితుడు ఇంటికి వెళ్లి తలుపు కొట్టినప్పటికీ లేవకపోవడంతో కిటికీలోంచి చూడగా, రాజు ఉరేసుకొని కనిపించాడు. రాజు తండ్రి దారంగుల చిన్న నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ తండ్రి దినకర్మరోజే ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్ఐ రాహుల్‌రెడ్డి వివరాల ప్రకారం.. దుమాలకు చెందిన ఆటోడ్రైవర్ పాముల భాస్కర్ (43)కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భాస్కర్ గతంలో రూ.5లక్షల వరకు అప్పు చేసి బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ సరైన జీతం లేక ఇంటికి తిరిగి వచ్చి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇక్కడ సైతం ఆటో సరిగా నడువకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ నెల 7న తన తండ్రి బాలమల్లు అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి మరింత కుంగిపోయాడు. సోమవారం దినకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి, రాత్రి వరకు అక్కా బావతో మాట్లాడిన భాస్కర్, ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం దుమాల శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించగా, స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.