హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఆటోడ్రైవర్ల ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేల జీవన భృతి ఇవ్వకపోగా.. వాటిని అడిగిన పాపానికి పోలీసులు ఒక్కో ఆటో డ్రైవర్‌ను ఈడ్చిపడేశారు. తమ హక్కుల సాధనకోసం అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్లు యత్నించగా.. శుక్రవారం అర్ధరాత్రి నుంచే అరెస్టులు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు వివిధ రూపాల్లో హైదరాబాద్‌కు తరలిరాగా.. రాత్రి ఎక్కడికక్కడే జిల్లాల్లో అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆటో డ్రైవర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయినా పోలీసుల అడ్డంకులను తొలగించుకొని అన్నిజిల్లాల నుంచి వందలాది మంది ఆటో డ్రైవర్లు శనివారం అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారు.
తొలుత హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ నుంచి అమరవీరుల స్తూపం వరకూ యాత్ర చేపట్టేందుకు సిద్ధపడగా, అక్కడే పలువురిని అడ్డుకున్నారు. వందలాదిగా మోహరించిన పోలీసులు ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేశారు. ప్లకార్డులు పట్టుకున్నవారిని ఈడ్చిపడేశారు. నాయకులను అరెస్టు చేసి సమీపంలోని ముషీరాబాద్, నాంపల్లి స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆటో జేఏసీ అధ్యక్షుడు మారయ్య డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆటోడ్రైవర్లు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపిన కేటీఆర్‌కు ఆటో జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, ప్రవీణ్ (టీయూటీసీ), లక్ష్మణ్ (సీఐటీయూ), యాదగిరి (టీఎన్టీయూసీ), సత్తిరెడ్డి (టీఏడీఎస్), శివానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల హామీలపై స్పష్టత ఇవ్వాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటోడ్రైవర్స్ అసోసియేషన్ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడం అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రెండు రోజుల ముందే నుంచే ఆటోడ్రైవర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాత్రివేళల్లో వారి ఇండ్లకు వెళ్లి నిర్బంధించి పోలీస్స్టేషన్లకు తరలించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆటోవాలాలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తేల్చిచెప్పారు.