హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఆటోడ్రైవర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ గద్దె దిగాలంటూ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మంగళవారం ఆటోడ్రైవర్ల మహాధర్నా ని ర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు నిర్ణయంతో రాష్ట్రంలో 150మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్కరినైనా సర్కార్ తరఫున ఆదుకున్నారా అని ప్రశ్నించారు.
బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవి శంకర్ మాట్లాడుతూ.. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే రవాణా బంద్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆటో అండ్ ట్యాక్స్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ పెంటయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఓలా ఉబర్ ర్యాపిడో వలన ఆటోలు నడువక డ్రైవర్లు బాధపడుతుంటే.. రవాణా శాఖ కొత్తపర్మిట్లు జారీ చేసి కోట్ల రూపాయల బ్లాక్ మార్కెట్కు తెరలేపిందని విమర్శించారు.
గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ..ఏడాదికి రూ.12వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రబారి గీత సోని, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతన నందకిశోర్, పీటీఎం రాష్ట్ర అధ్యక్షులు లిఖిత్ కుమార్, శ్రీనివాస్, జహంగీర్, ఆర్ మహేశ్ సంతోష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.