చిక్కడపల్లి/హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల నిరవధిక బంద్ నిర్వహిస్తామని ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం ద్వారా తమ ఉపాధిని నాశనం చేసి చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
గురువారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆటో డ్రైవర్ల సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆటో పర్మిట్లను వెంటనే జారీ చేయాలని కోరారు.