ధారూరు, మార్చి 18 : పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ధారూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన దోమ గోపాల్ (25) అనే వ్యక్తి అటో నడుపుతూ జీవనం కొనసాగించేవాడు.
శుక్రవారం గ్రామంలో హోలీ సంబురాలు ముగించుకొని గ్రామ సమీపంలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో స్నానం చేసేందుకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేందర్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య అక్షర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు.