Musi Demolitions | ఉప్పల్, డిసెంబర్ 12 : మూసీ పరిసర ప్రాంత ప్రజల్లో మళ్లీ భయం మొదలైంది. బఫర్ జోన్లో ఉన్నాయంటూ ఇండ్లను కూల్చివేస్తారని జరుగుతోన్న ప్రచారం పేదల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లను కండ్లముందే కూల్చివేస్తారేమోనని ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తన ఇంటిని కూల్చివేస్తారని దిగులు చెందిన ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన రామంతాపూర్లో చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. రామంతాపూర్ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన రవీందర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మూసీ కూల్చివేతల్లో భాగంగా తమ ఇంటిని కోల్పోతామని కొద్దిరోజులుగా దిగాలుగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రోజూ మాదిరిగానే గురువారం నాగోల్ నుంచి ఇంటికి వస్తుండగా గుండెపోటు రావడంతో రవీందర్ మృతిచెందాడు. తన ఇంటిని కూల్చివేస్తారనే ఆవేదనతోనే మరణించినట్టు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుండెపోటుతో రవీందర్ మృతి చెందిన విషయం సోషల్ మీడియాతోపాటు స్థానిక గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
మూసీ బఫర్జోన్లో కాలనీలు ఉన్నాయంటూ ఇండ్లను కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో పేదల్లో భయం పట్టుకున్నది. ఇన్నాళ్లూ కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి వెళ్లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు పాదయాత్రలు చేపట్టి, ఈ కాలనీవాసులకు భరోసాను కల్పించిన విషయం తెలిసిందే. రవీందర్ మృతితో ఇండ్లు కూల్చివేస్తారనే అంశం మళ్లీ తెరపైకి రావడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.