ఇల్లెందు, మే 27 :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల ఆటోలు నడవకపోవడం.. పొద్దంతా పడిగాపులు కాసినా ఆటో ఎక్కేవారు లేకపోవడం.. దీనికితోడు కుటుంబ పోషణ భారం కావడం.. అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఆర్అండ్ఆర్ కాలనీ చోటుచేసుకున్నది. . సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లెందు పట్టణంలోని 14వ నంబర్ బస్తీకి చెందిన పాసి దుర్గాప్రసాద్(రాజేందర్) (45) జగదాంబ సెంటర్ అడ్డాలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. వారిలో ఒక కుమార్తె పెళ్లి చేశాడు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటో సరిగ్గా నడవకపోవడం, కూతురు పెళ్లి చేయడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన దుర్గాప్రసాద్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి ఆటో తీసుకొని వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో పురుగుల మందుతాగి మృతిచెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య మీనాకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సుతో ఆటోలు సరిగా నడవకపోవడం.. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో దర్గాప్రసాద్ బలవన్మరణానికి పాల్పడినట్టు ఆటో యూనియన్ నాయకులు ఆరోపించారు.