భువనగిరి అర్బన్, ఏప్రిల్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఉపాధి కరువై, సర్కారు నుంచి భరోసా లేక మరో ఆటోడ్రైవర్ ప్రాణం తీసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెలుపల్లికి చెందిన పబ్బ శ్రవణ్‌కుమార్‌గౌడ్(30) నాలుగేండ్ల క్రితం భువనగిరికి వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోకు గిరాకీ తగ్గింది. రోజంతా నడిపినా పూటగడవని పరిస్థితి నెలకొన్నది. దానికితోడు ఆటోకోసం తెచ్చిన ఫైనా న్స్ డబ్బులు, కుటుంబ పోషణ కోసం తీసుకున్న డెయిలీ ఫైనాన్స్ భారంగా మారాయి. అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శ్రవణ్‌కుమార్‌గౌడ్ వారం రోజుల క్రితం భువనగిరి ఆటో స్టాండ్ లో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తోటి డ్రైవర్లు గమనించి ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించి మం గళవారం మృతిచెందాడు. కాగా మహాలక్ష్మి పథకంతో ఆటో నడవక, అప్పు లు ఎక్కువై శ్రవణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆటో యూనియన్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొమ్ము జగదీశ్ డిమాండ్ చేశాడు.