ఏటూరునాగారం, జనవరి 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో గిరాకీ లేక అప్పులపాలైన ఓ టాటా మ్యాజిక్ యాజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాస నాగరాజు(28) రెండేళ్ల క్రితం రెండు టాటా మ్యాజిక్ వాహనాలను ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. ఒకటి తాను సొంతంగా నడుపుకుంటుండగా మరొకటి తన అన్న కుమారుడు ప్రశాంత్‌కు అప్పగించాడు.
బస్టాండ్ నుంచి మణుగూరు, హనుమకొండ వైపు వీటిని నడుపుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత ఏడాదిగా ఆదాయం సరిగా రాకపోవడం, రోజుకు రూ. 300 మాత్రమే రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో 4లక్షలకు పైగా అప్పులు చేశాడు. వారం, వారం కిస్తీలు చెల్లించడం, ఇతర అప్పులకు వడ్డీ కట్టడం కష్టంగా మారింది. దీంతో తల్లి పేరుతో ఉన్న ఎకరం భూమిపై కూడా అప్పు తీసుకున్నాడు. అప్పుల వారు, ఫైనాన్స్ వారి ఒత్తిడిని తట్టుకోలేక మనస్తాపం చెందాడు.
సోమవారం రాత్రి భార్య నవనీతకు మంగపేట మండలం రాజుపేటకు కిరాయికి వెళ్తున్నానని చెప్పాడు. జాతీయ రహదారిపై ఉన్న జంపన్నవాగు మూడో బ్రిడ్జి దాటిన తర్వాత టాటా మ్యాజిక్‌ను రోడ్డు కిందకు దింపుకుని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం స్థానిక రైతు నాగరాజు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి తల్లి, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నాగరాజు మృతిపై టాటా మ్యాజిక్, ఆటో డ్రైవర్లు బస్టాండ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేసి సంతాపం ప్రకటించారు. మృతదేహాన్ని ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు.