రాయపోల్,డిసెంబర్ 20 : అప్పుల బాధ భరించలేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లిలో ఆటోడ్రైవర్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపల్లికి చెందిన పంగ యాదగిరి (48) బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి అటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటో కొనుగోలుకు, కుటుంబాన్ని పోషించడానికి అప్పులు ఎక్కువయ్యాయి. ఆటో నడిపినా అంతంతమాత్రంగానే ఆదాయం రావడంతో డబ్బులు సరిపోక తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో వారం క్రితం స్వగ్రామం కొత్తపల్లికి వచ్చి పురుగులమందు తాగాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనం ద్వా రా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించగా గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. యాదగిరికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రాయపోల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో దేవయ్య తెలిపారు.