కామారెడ్డి రూరల్ , జూన్ 1: ఫైనాన్స్ కిస్తీలు, చేసిన అప్పులు తీరకపోవడంతో పాటు మహిళలకు ఉచిత బస్సుతో ఆటో నడవక మరిన్ని అప్పులు కావడంతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలు .. కామారెడ్డి మండలం గర్గుల్కు చెందిన గుంటికాడి నర్సింహులు(45) ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహిళలకు ఫ్రీ బస్సు’పథకంతో ఆటో గిరాకీ దెబ్బతిన్నది. దీంతో కుటుంబపోషణకు అప్పుల పాలయ్యాడు. ఆటో నడవకపోవడంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టడానికి డబ్బులు లేక మరిన్ని అప్పులు మీదపడ్డాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన నర్సింహులు ఆదివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య వినోద, ఇద్దరు కొడుకులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆటో యూనియన్ నాయకులు కోరారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజు తెలిపారు.