హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 ( నమస్తే తెలంగాణ ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. గిరాకీ లేకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 102 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తూప్రాన్‌కు చెందిన ఆటో డ్రైవర్ గజ్జల బాబు(30) గిరాకీలు లేక ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం రాత్రి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్ గజ్జల బాబుకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో యూనియన్ నాయకుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల చావులంటే సీఎంకు ఎందుకు అంత చులకనా? అని ప్రశ్నించారు. మెరుగైన వైద్యం అందించి ఆటో డ్రైవర్ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.
గిరాకీ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఏడాదికి రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ అమలు చేయకుండా డ్రైవర్ల మరణాలకు కారణమవుతున్నదని దుయ్యబట్టారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏర్పుల బాల్‌రాజ్ మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయం వల్ల గజ్జెలబాబు ఒక్కడే కాదు బాబు లాంటి ఎంతో మంది ఆటో కార్మికులు తనువులు చాలిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.