కరీంనగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న దళిత జర్నలిస్టుపై కాంగ్రెస్ సర్కారు ఉకుపాదం మోపింది. సిరిసిల్లలో అధికారుల దురాగతాలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో ప్రజలకు తెలియజేస్తున్న సీనియర్ జర్నలిస్టు కాయితీ బాలుపై ఆంక్షలు విధించింది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను బాలు ప్రజల్లోకి తీసుకెళ్తూనే, అధికారుల పొరపాట్లను ఎత్తి చూపుతున్నారు. దీంతో ఆగ్రహించిన అధికారులు ఏకంగా ఆయనకు బీఎన్ఎస్ యాక్ట్‌లోని 163 సెక్షన్‌ను అమలు చేసి, నెల రోజులపాటు ఏమీ మాట్లాడవద్దని హుకుం జారీచేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రగతినగర్‌లోని బాలు నివాసానికి ఈ నెల 23న నోటీసులు అతికించారు. దీంతో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నొక్కేస్తున్నదని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.
కేకే మహేందర్‌రెడ్డి బెదిరింపులు
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన పలువురు కార్మికులు చేయని తప్పులకు అక్కడ 20 ఏండ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుండటంతో వారి విడుదలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నించారని, ఆయన చొరవతో ఇటీవల ఆ అభాగ్యులు విడుదలయ్యారని కొద్దిరోజుల క్రితం బాలు రాసిన వార్త కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడలేదు. అప్పటి నుంచి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నట్టు బాలు ఆరోపించారు. నేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంలేదని, దీంతో వారంతా రోడ్డున పడుతున్నారని సోషల్ మీడియాలో బాలు ప్రసారం చేయడం కాంగ్రెస్ నేతలకు రుచించలేదు.
కేటీఆర్ ఫొటో ఉన్నదని టీస్టాల్ తరలింపు
సిరిసిల్లలో ఓ నిరుపేద నడుతుపుతున్న టీస్టాల్కు మాజీ మంత్రి కేటీఆర్ ఫొటో ఉండటంతో ఇటీవల ఆ టీస్టాల్‌ను అక్రమంగా తరలించడంపై బాలు కలెక్టర్‌ను నిలదీశారు. అభిమానంతో కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకు ఆ నిరుపేద పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని ప్రశ్నించినందుకు తనపై వ్యక్తిగత దాడులకు దిగారని బాలు వాపోయాడు.
కలెక్టర్ కక్షపూరిత వైఖరి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న తన సతీమణి సౌభాగ్యను రుద్రంగి మండలం మానాలకు బదిలీ చేశారని బాలు ప్రశ్నించారు. వాస్తవానికి 14 ఏండ్లు రూరల్ ఏరియాలో పనిచేసిన సౌభాగ్య తన కుమారుడి అనారోగ్య కారణాలతో బదిలీపై వెంకంపేట స్కూల్‌కు వచ్చారు. ఇక్కడ 107 మంది విద్యార్థులకు నలుగురు టీచర్లు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 91 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలో నలుగురు టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ బాలుపై కక్షతో సౌభాగ్యను కలెక్టర్ అక్రమంగా మానాల పాఠశాలకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో కోనరావుపేట మండలం బాబుసాయిపేట పాఠశాలలో పనిచేస్తున్న రమాదేవిని డిప్యూటేషన్‌పై వెంకంపేట పాఠశాలకు బదిలీ చేశారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను 14న రాత్రి 9 గంటలకు వాట్సప్‌లో సౌభాగ్యకు పంపి, మరునాడే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఇండ్ల కొలతలతో అధికారుల బెదిరింపులు
బాలుకు జగ్గారావుపల్లితోపాటు ప్రగతినగర్‌లో నివాసాలున్నాయి. ఎవరూ లేని సమయంలో అధికారులు ఆ ఇండ్లలో ప్రవేశించడంతోపాటు కొలతలు వేసి బెదిరింపులకు పాల్పడ్డారు. వీటిపై నాయకులు ఫిర్యాదులు చేశారని, అందుకే కొలతలు వేసినట్టు చెప్పడం కొసమెరుపు. ప్రజాపాలనలో నిరుపేదలపై ఉకుపాదం..
సిరిసిల్ల జిల్లాలో నిరుపేదలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉకుపాదం మోపుతున్నారని బాలు వార్తలను ప్రసారం చేశారు. రాజిరెడ్డి అనే రైతును అన్యాయంగా కేసులో ఇరికించడంతో ఆయనను ఇంటర్వ్యూ చేసి ప్రజలకు తెలియజేశాడు. అలాగే పెద్దూరు గ్రామానికి చెందిన బాలరాజు, బాలయ్య అనే నిరుపేదలను పండుగ పూట జైలుకు పంపారనే కథనాలు రాశాడు. వేలమంది రైతు కుటుంబాలకు అండగా ఉంటున్న అగ్రహారంలోని కరీంనగర్ డెయిరీని అడ్డగోలుగా సీజ్ చేయడం, దానిపై పాడి రైతులు నిరసన వ్యక్తం చేయడంపై ఎప్పటికప్పు్పడు వార్తలను ప్రసారం చేసి, ప్రజల పక్షాన నిలవడంతో తనపై అధికారులు, కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బాలు ఆరోపించాడు.