హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తుంటే.. ఒక్కసారిగా ఏదో అద్భుతం జరిగినట్టు హైదరాబాద్‌లో ఎకరానికి రూ.177 కోట్లు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హెచ్ఎండీఏ హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లకు వేలం వేస్తే మూడు ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోగా రూ.500 కోట్లు వస్తాయనుకుంటే రూ.38 కోట్లే సమకూరగా అంతలోనే టీజీఐఐసీ సోమవారం నిర్వహించిన వేలంపై ఇంత భారీ ధర పలకడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భూముల ధరలు గణనీయంగా పడిపోయిన వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకే రేవంత్ సర్కారు ఏదో మాయాజాలానికి తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని రాయదుర్గంలో భూములు సోమవారం నిర్వహించిన వేలంలో ఎన్నడూ లేనివిధంగా ఎకరం రూ.177 కోట్లకు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయాయి.
టీజీఐఐసీ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 7.67 ఎకరాల భూమికి వేలం వేయగా రూ.1,357.59 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే మరో 11 ఎకరాలకు వేలం వేయగా ఎకరానికి రూ.141.5కోట్లు పలికింది. మొత్తం రూ.1556.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వేలంలో స్థానిక డెవలపర్లతో పాటు జాతీయ స్థాయి డెవలపర్లు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ సుస్థిరాభివృద్ధిపై పెట్టుబడిదారుల్లో ఉన్న విశ్వాసం వల్ల ఇంత భారీస్థాయిలో ధర పలికినట్లు టీజీఐఐసీ ఎండీ శశాంక పేర్కొన్నారు. టీజీఐఐసీ తరపున జేఎల్ఎల్ ఇండియా, ఎంఎస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించాయి. 2017లో రాయదుర్గంలో 2.84 ఎకరాలకు వేలం వేయగా ఎకరం రూ.42.59 కోట్లకు అమ్ముడుపోయింది. 2022లో కోకాపేట నియోపోలీస్లో హెచ్ఎండీఏ 3.60 ఎకరాలకు వేలం నిర్వహించగా ఎకరం ధర రూ.100.75కోట్లు పలికింది. తాజాగా రాయదుర్గంలో 7.67 ఎకరాలకు టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ.177కోట్లు పలికిందని, ఇది గతంలోని రికార్డులను చెరిపివేసినట్లు ఎండీ వివరించారు. అయితే, కొనుగోలు చేసిన సంస్థ పేరును మాత్రం ఎండీ వెల్లడించకపోవడం గమనార్హం.
ఇటీవల హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కోకాపేట, బాచుపల్లి, తుర్కయాంజల్, శేరిలింగంపల్లి, పుప్పాలగూడ తదితర ప్రాంతాల్లో 103 ప్లాట్లకు వేలం నిర్వహించారు. కాగా, ఇందులో తుర్కయాంజల్‌లో 12 ప్లాట్లకు గాను 2 ప్లాట్లు, పుప్పాలగూడలో 3 ప్లాట్లకు గాను ఒకటి మాత్రమే అమ్ముడుపోయాయి. మిగిలిన 100 ప్లాట్లు కొనేందుకు ఎవరూ ముందుకురాలేదు. అంతేకాదు, హెచ్ఎండీఏ అధికారులు 103 ప్లాట్లకు కనీసం రూ.500 కోట్లు వస్తాయని అంచనా వేయగా, కేవలం రూ.38కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రియల్ రంగం పూర్తిగా పడిపోయిందనే విమర్శలు వెల్లువెత్తడంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగిందని అందుకే తాజా వేలంలో రికార్డు ధర పలికినట్లు చెబుతున్నదని పలువురు భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో కూడా రికార్డు స్థాయి ధరలు పలికాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో నివాస స్థలాల విక్రయాల కోసం సోమవారం నిర్వహించిన వేలంలో చదరపు గజం ధర రూ.1,14,000 పలికింది. 513 గజాల విస్తీర్ణంలోని హెచ్ఐజీ ఓపెన్ ప్లాట్‌కు ఆఫ్సెట్ ధర రూ.80 వేలు నిర్ధారించగా, బహిరంగ వేలంలో చదరపు గజానికి రూ.1.14 లక్షల ధర పలికినట్లు హౌసింగ్‌బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. హెచ్‌ఐజీలోనే మరో 389 చదరపు గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్‌కు గాను చదరపు గజానికి లక్ష రూపాయల ధర పలికిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం వేయగా బోర్డుకు సుమారు రూ.44.24 కోట్ల మేర ఆదాయం సమకూరింది. 27మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలంలో చదరపు గజానికి సగటున రూ.91,947 ధరకు కొనుగోలు చేశారని గౌతం తెలిపారు. కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి పరిసరాల్లోని భూములకే అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో చింతల్ ప్రాంతంలో కూడా చదరపు గజం ధర లక్ష రూపాయలు దాటడం విశేషం.