Neera Cafe | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నడిగడ్డలో నీరాకేఫ్పై ఓ మంత్రి కన్నుపడిందా? నిన్నటి వరకు కేఫ్‌ను అప్పగించినట్టే ఇచ్చి.. మళ్లీ తెరవెనుక వేరే కథ నడుపుతున్నారా? ఆయన ఆదేశాల మేరకే ఓ కార్పొరేషన్ ఎండీ తెరవెనుక పావులు కదుపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి గౌడ సంఘాలు. తమ బంధువర్గానికి కేఫ్‌ను ధారాదత్తం చేసేందుకు ఆ మంత్రి ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధపడ్డట్టు చెప్తున్నారు. చెప్పేదొక్కటి.. చేసేది మరొక్కటన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని గౌడ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నీరాకేఫ్‌ను తాత్కాలికంగా కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగిస్తూ సర్క్యూలర్ జారీ చేసినా కూడా వేరే మార్గాల ద్వారా దక్కించుకునేందుకు సదరు మంత్రి విశ్వప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీజు పేరుతో ఆ స్థలాన్ని కొల్లగొట్టేందుకు తనకు అనుకూలమైన ఓ కార్పొరేషన్ ఎండీ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసింది.
నీరా కేఫ్ వేరే.. ఇతర స్టాళ్లు వేరే?
సదరు మంత్రి నడుపుతున్న మంత్రాంగంలో భాగంగా మరో పథకం వేసినట్టు తెలుస్తున్నది. నీరా విభాగాన్ని మాత్రమే విభజించి, దానిని కల్లుగీత కార్పొరేషన్‌ను అప్పగిస్తారని సమాచారం. మిగతా మొత్తం స్థలాన్ని తమ అనుచరులకు ఇప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు జోరుగా చర్చ జరుగుతున్నది. మొత్తం వ్యవహారంలో మరో సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. కాగా ఇప్పటికే శంకర్‌రెడ్డి అనే వ్యక్తికి ఎలాంటి టెండర్లు లేకుండానే నీరాకేఫ్లోని కొన్ని స్టాళ్లను అప్పగించినట్లు సమాచారం.
గౌడ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఆగమేఘాలపై ప్రభుత్వం సర్క్యూలర్ ఇచ్చినా దానిని ఎలాగైనా దక్కించుకునేందుకు ఆ మంత్రి తెరవెనుక తతంగమంతా యథావిధిగా కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఆ మంత్రి ఒత్తిడితోనే టూరిజం, కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ ఉమ్మడి బోర్డు సమావేశంలో ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలపై చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పడం వెనుక ఆ మంత్రి పాత్ర ఉందని పలు గౌడ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ నీరాకేఫ్ విషయంలో ఆ మంత్రి చెప్పినట్టే ఓ కార్పొరేషన్ ఎండీ తలూపడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్తున్నారు.బంధువులకు అప్పగించేందుకు..!సదరు మంత్రి గౌడ సంఘాల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ కేఫ్‌ను తమ బంధువులకు ఇప్పించుకుని, కోట్లు కొల్లగొట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారాన్ని గౌడ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పథకం ప్రకారమే కేఫ్‌ను క్రమపద్ధతిలో బ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్నారు. సదరు మంత్రి బంధువులు ఇప్పటికే నీరాకేఫ్‌ను సందర్శించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కేఫ్‌లోని స్టాళ్లు, వాటి నిర్వహణ ఇతర అంశాలపై సదరు కార్పొరేషన్ ఎండీ ద్వారా తెలుసుకున్నారని సమాచారం. కేఫ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం, పబ్ తరహా హోటళ్లు ఉన్నాయి. అదే తరహాలో దాన్ని అభివృద్ధి చేసి, డబ్బులు బాగా దండుకోవాలని సదరు మంత్రి బంధువులు కుట్ర పన్నుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుడు గత ప్రభుత్వం ఓ ఉన్నత ఆశయం, ఉపాధి కల్పన లక్ష్యంగా సిద్ధం చేసిన నీరా కేఫ్‌ను ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతున్నది. వెరసి గౌడన్నల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం జోరుగా జరుగుతున్నది.