ఇచ్చోడ, ఏప్రిల్ 16: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగం జరిగిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. హెచ్ఎం ప్రతిభ వివరాల ప్రకారం.. పాఠశాలకు వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో వంట గదికి సిబ్బంది తాళం వేసుకునివెళ్లారు.
సెలవుల అనంతరం మంగళవా రం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో నురగలు రావడంతో చుట్టుపకల చూడగా పురుగులమందు డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంక్లోనూ పురుగులమందు కలిపినట్టుగా గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను అటువైపు వెళ్లకుండా చూశారు.
మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 30 మంది విద్యార్థులు విషప్రయోగం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై హెచ్ఎం ఫిర్యాదు చేయగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, సీఐ భీమేశ్ ఘటన స్థలాన్ని పరిశీలించారని ఎస్పీ అఖిల్మహాజన్ తెలిపారు. ధర్మపురిలోని గోండుగూడకు చెందిన సోయం కిష్టును అరెస్టు చేయగా తానే వాటర్ ట్యాంక్, వంట పాత్రలపై పురుగులమందు చల్లానని ఒప్పుకున్నాడని వెల్లడించారు.