బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 01:51:52

మరో నాలుగు ఉత్పత్తులకు జీఐ గుర్తింపునకు యత్నం

మరో నాలుగు ఉత్పత్తులకు జీఐ గుర్తింపునకు యత్నం

  • జాబితాలో తాండూరు పప్పు, నిజామాబాద్‌ పసుపు, 
  • వరంగల్‌ మిర్చి, బాలానగర్‌ సీతాఫలం
  • వివరాల సేకరణలో సీఐఐ, వ్యవసాయవర్సిటీ నిమగ్నం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా పేరొందిన రాష్ట్రంలో ప్రధానమైన నాలుగు వ్యవసాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోలాజికల్‌ ఐడెంటిఫికేషన్‌- జీఐ) సాధించేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో 15 ఉత్పత్తులు, వస్తువులు జీఐ పొందాయి. తాజాగా మరో నాలుగుంటికి దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. మంత్రి కేటీఆర్‌ సూచనలతో రాబోయే రోజుల్లో తెలంగాణలోని జిల్లాల్లో కనీసం ఒక్క ఉత్పత్తి, లేదా వస్తువు అయినా జీఐ గుర్తింపుపొందినది ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), వ్యవసాయ విశ్వవిద్యాలయం, చేనేత, జౌళిశాఖ ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాధాన్యమున్న తాండూరు కందిపప్పు, నిజామాబాద్‌ పసుపు, బాలానగర్‌ సీతాఫలం, వరంగల్‌ మిర్చిరి భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయనున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు కందిపప్పుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. ఇక్కడి కందిపప్పు వివిధ రాష్ర్టాలతోపాటు, ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నది. దేశంలో అత్యధిక పసుపు పండే జిల్లాల్లో నిజామాబాద్‌ ఒకటి. నాణ్యత అధికంగా ఉండే నిజామాబాద్‌ పసుపును అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో చపాటా రకం మిర్చి (దొడ్డుమిర్చి)ని అధికంగా పండిస్తారు. పురుగు మందులను తక్కువగా వాడే ఈ మిర్చికారంను పచ్చళ్ల తయారీలో ఉపయోగిస్తారు. రంగారెడ్డి జిల్లా బాలానగర్‌ సీతాఫలం ఇతర రాష్ర్టాలకు అధికంగా ఎగుమవుతున్నది.logo