Monkey | న్యూఢిల్లీ: మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయట. మొదటిసారిగా ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు. సుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని ఒక మగ కోతి ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.
ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. దీంతో అది ఫైబ్రూరియా టింక్చర్ అనే మొక్కల ఆకులతో స్వీయవైద్యం చేసుకున్నది. ముందుగా ఈ ఆకులు నమిలి, వాటి పసరును గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు, గాయం మానేందుకు ఈ కోతి సాధారణం కంటే ఎక్కువ సేపు పడుకుందని పరిశోధకులు తెలిపారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు.