ఐపీఎల్ -17 ప్లేఆఫ్స్ రేసులో ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న ఆశలను కూడా ముంబై ఇండియన్స్ చేజేతులా జారవిడుచుకుంది. సొంత మైదానంలో బౌలర్లు రాణించి కోల్‌కతా నైట్ రైడర్స్
(కేకేఆర్)ను 169 పరుగులకే కట్టడిచేసినా స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక 145 వద్దే చేతులెత్తేసింది. ముంబైకి ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌లలో 8వ ఓటమి. బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో
రాణించిన కోల్‌కతా..ఏడు విజయాలతో ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.
IPL | ముంబై: ఐపీఎల్-17లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్ వాంఖడేలో మరోసారి నిరాశపరించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప ఛేదనలో 18.5 ఓవర్లు ఆడి 145 పరుగులకే కుప్పకూలి ఈ సీజన్లో 8వ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 56, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. స్వల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కేకేఆర్ బౌలర్లు మిచెల్ స్టార్క్ (4/33), వరుణ్ (2/22), నరైన్ (2/22), రస్సెల్(2/30) ముంబైని కట్టడిచేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. వెంకటేశ్ అయ్యర్ (52 బంతుల్లో 70, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మనీష్ పాండే (31 బంతుల్లో 42, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. నువాన్ తుషారా (3/42) ఆరంభంలోనే కోల్‌కతాను దెబ్బతీయగా జస్ప్రిత్ బుమ్రా (3/18) కట్టడిచేశాడు.వెంకటేశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతాను ముంబై పేసర్ తుషారా ఆరంభ ఓవర్లలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5)ను కోల్‌కతా ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఔట్ చేసి ఆ జట్టుకు తొలి షాకిచ్చాడు. అతడే వేసిన మూడో ఓవర్లో.. రెండో బంతికి అంగ్క్రిష్ (13) సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇవ్వగా చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ (6) మిడాన్‌లో టిమ్ డేవిడ్ చేతికి చిక్కాడు. హార్దిక్ పాండ్యా 5వ ఓవర్లో సునీల్ నరైన్ (8)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. రింకూ సింగ్ (9) చావ్లా 7వ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కేకేఆర్ కష్టాలు రెట్టింపయ్యాయి. 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో నుంచి కోల్‌కతా.. ముంబై ఎదుట 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచిందంటే అది వెంకటేశ్ – మనీష్ పోరాటమే. ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత జోరు పెంచారు. కొయెట్జి 12వ ఓవర్లో వెంకటేశ్.. 4, 6 బాదగా బుమ్రా 14వ ఓవర్లో పాండే సైతం ఫోర్, సిక్సర్‌తో జోరు పెంచాడు.
ఛేదనలో ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆ జట్టు మరో పరాభవం తప్పలేదు. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే స్టార్క్.. ఇషాన్ (13)ను బౌల్డ్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నమన్ ధీర్ (11)ను చక్రవర్తి 5వ ఓవర్లో తన స్పిన్ మాయాజాలంతో బోల్తొ కొట్టించాడు. రోహిత్ (11) కూడా నరైన్ ఆరో ఓవర్లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తిలక్ వర్మ (4), వధెరా (6), ముంబై సారథి హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యారు. వరుసగా వికెట్లను కోల్పోతూ ఓటమి వైపుగా సాగుతున్న ముంబైని సూర్య ఆదుకునే యత్నం చేశాడు. వైభవ్ 14వ ఓవర్లో సూర్య 4, 6, 4, 4 తో ముంబై ఇన్నింగ్స్‌కు ఊపు తేవడమే గాక 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. కానీ రస్సెల్ 16వ ఓవర్లో ఫుల్‌టాస్‌ను ఆడబోయి సాల్ట్‌కు క్యాచ్ ఇవ్వడంతో ముంబై ఓటమి ఖరారైంది.
కోల్‌కతా: 19.5 ఓవర్లలో 169 (వెంకటేశ్ 70, మనీష్ 42, బుమ్రా 3/18, తుషారా 3/42)
ముంబై: 18.5 ఓవర్లలో 145 (సూర్య 56, డేవిడ్ 24, స్టార్క్ 4/33, వరుణ్ 2/22)