హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళిత, గిరిజనులపై దాడులు ఏటికేడు పెరిగిపోతున్నాయి. దీంతో ఆ కేసుల సంఖ్య అంతకంతకూ అధికమవుతున్నది. ఈ కేసుల విచారణ నత్తనడకన సాగుతున్నది. బాధితులకు అండగా నిలబడి, ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని మరింత బాధితులుగా మార్చుతున్నది. పునరావాసానికి నిధులు చెల్లించకుండా బాధితులను రెండున్నరేండ్ల నుంచి తిప్పుకొంటున్నది. అట్రాసిటీ చట్టానికి సైతం తూట్లు పొడుస్తున్నది. దీనిపై ఏకంగా జాతీయ ఎస్సీ కమిషన్ తలంటినా రేవంత్‌రెడ్డి సర్కార్ ఏమాత్రం చలించడం లేదు. పైపెచ్చు కేంద్రం విడుదల చేస్తున్న నిధులను స్వాహా చేస్తున్నది.
వాస్తవానికి 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,044 అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ, ఈ సంఖ్యను తగ్గించి చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల కేసులే నమోదైనట్టు వెల్లడించింది. దీనిపై దళిత, గిరిజన సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలే ఎక్కడికక్కడ తమ పలుకుబడిని ఉపయోగిస్తూ కేసుల నమోదును అడ్డుకుంటున్నారని మండిపడుతున్నాయి.
దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై దాడులను నిరోధించేందుకు తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధించడంతోపాటు బాధితులకు సత్వర ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలి. అందుకోసం ఈ చట్టంలోని సెక్షన్ 12(4), 4ఏ కింద జిల్లా కలెక్టర్లు తక్షణ చర్యలు చేపట్టాలి. రా్రష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,088 మంది అట్రాసిటీ బాధితులున్నారు. వారికి దాదాపు రూ.40 కోట్ల మేరకు పరిహారం అందాల్సి ఉన్నది. కానీ, రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ బాధితులకు పరిహారం చెల్లించడం లేదు. నిధుల విడుదలలో ప్రభుత్వం తాత్సారం చేయడంపై గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నోటీసులు జారీచేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం చిట్టచివర్లో రూ.20 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, ఆ నిధులు ఇప్పటికీ బాధితుల ఖాతాల్లో జమ కాలేదు. అట్రాసిటీ బాధితుల పునరావాసం, పరిహారం కోసం ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన రేవంత్‌రెడ్డి సర్కార్.. అందులో నామమాత్రంగా రూ.5.59 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ, ఆ నిధులు కూడా ఇప్పటికీ బాధితుల ఖాతాల్లో జమ కాలేదు.
అట్రాసిటీ బాధితులకు అందజేసే పరిహారాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 నిష్పత్తిలో చెల్లించాల్సి ఉంటుంది. కేసు నమోదైన వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఈ పరిహారాన్ని చెల్లించి ఆర్థిక సంవత్సరం ముగిశాక కేంద్రం నుంచి పొందాల్సి ఉంటుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎస్ఎస్ఏ అకౌంట్ ద్వారా ఈ చెల్లింపులు కొనసాగగా, ప్రస్తుతం స్పర్శ్ పద్ధతిలో చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల కేంద్రం నిధులను విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌ను కలిపి రూ.5.59 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, నిధులు బాధితుల అకౌంట్లకు చేరలేదు. దీంతో బాధితులకు అందాల్సిన పరిహార నిధులను కాంగ్రెస్ సర్కార్ దారిమళ్లిస్తున్నదని దళిత, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి ట్రెజరీ కంట్రోల్, అకౌంట్స్ తదితర సడలింపులు ఇచ్చయినా బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ గ్రీన్‌చానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని ఉన్నతాధికారులు 4 నెలలక్రితమే ప్రతిపాదనలు పంపారు. కానీ, వాటిపై ఇప్పటికీ అతీగతీ లేకపోవడం కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనతకు అద్దం పడుతున్నది.
