ప్రత్యేక ప్రతినిధి, మే 8(నమస్తే తెలంగాణ) : పవిత్ర పుణ్యక్షేత్రం బాసరలో అపవిత్ర కార్యకలాపాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆంధ్రా నుంచి కొన్నేండ్ల క్రితం వచ్చిన వేద విద్యానందగిరి స్వామీజీ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బాసర క్షేత్ర వైభవాన్ని మసక బారుస్తున్నాయి. అక్కడి శ్రీ వేద భారతీపీఠం పాఠశాలలో ఇద్దరు బీసీ విద్యార్థులపై వరుస దాడులు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మార్చి 19న అర్ధరాత్రి పాఠశాలలో జరిగిన దాడిలో లోహిత్ అనే విద్యార్థి తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. గాయపడిన లోహిత్‌ను చూసిన మణికంఠ అనే మరో విద్యార్థి ఏప్రిల్ 4న విద్యుదాఘాతంతో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ రెండు ఘటనలు జరిగి 50రోజులు పూర్తి కావస్తున్నా, కేసుల్లో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్మల్ జిల్లా కలెక్టర్ సహా జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతి చిన్న విషయానికి స్పందించి ఆగమేఘాలపై చర్యలు తీసుకునే కలెక్టర్ అభిలాష అభినవ్.. బాసరలో జరుగుతున్న ఈ ఘోరకలిపై నోరు మొదపకపోవడం, ఇప్పటి దాకా విచారణ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. వేద పాఠశాలలో చేరిన పేద పిల్లలతో స్వామీజీ వెట్టి చాకిరీ చేయించుకుంటారని.. అసలు ఇక్కడ వేదాలు నేర్పించడం కన్నా ఇతరత్రా కార్యకలాపాలే ఎక్కువగా ఉంటాయని ఆ పాఠశాలలో వేద గురువుగా పనిచేసిన ఉజ్జయినికి చెందిన పంకజ్ తెలిపారు. వేద పాఠశాల నిర్వహణ సక్రమంగా లేని కారణంగానే తాను రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. స్వామీజీ అసలు పేరు, అడ్రస్ కూడా తెలియకుండా నకిలీ చిరునామా, కొత్త పేరుతో ఈ ప్రాంతంలో చెలామణి అవుతున్నారని ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
వరుస ఘటనలతో చర్చనీయాంశంగా మారిన బాసరలోని శ్రీవేదభారతీ పాఠశాల నిబంధనలను పాటించడంలేదని తెలిసింది. మైనర్లతో పాఠశాల నిర్వహించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ పాఠశాలకు అలాంటివి అనుమతులేవీ లేవని పోలీసులే చెప్తున్నారు. లోహిత్ గాయాలతో పడి ఉన్నప్పుడు పాఠశాలలో 53 మంది విద్యార్థులుంటే అందులో 20 మంది మైనర్లే ఉన్నట్టు తెలిసింది. మైనర్లను వెంటనే ఇంటికి పంపాలని పోలీసులు చెప్తే, వారితోపాటు మిగిలిన విద్యార్థులను కూడా నిర్వాహకులు ఇంటికి పంపారు. అందరినీ పంపిన నిర్వాహకులు మణికంఠను మాత్రం వెళ్లనివ్వలేదు. ఈ విషయాన్ని మణికంఠ స్వయంగా ఫోన్లో తన కుటుంబసభ్యులకు చెప్పాడు. విచారణ నుంచి తప్పించుకోవడంలో భాగంగానే అందరినీ ఇంటికి పంపి, మణికంఠను గోదాట్లోకి పంపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులపై దాడుల అనంతరం వేదపాఠశాల నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలోకి ఎవరూ వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు. పదిరోజుల క్రితమే సెక్యూరిటీ గార్డును పెట్టారు. వేద పాఠశాల నిర్వహకుడైన విద్యానందస్వామి ఎవరితోనూ మా ట్లాడం లేదు. ఏం మాట్లాడాలన్నా స్వామీజీ శిష్యులతో ఏర్పాటు చేసిన కమిటీతోనే మాట్లాడాలని చెప్పి పంపించేస్తున్నారు.
లోహిత్‌పై కొండముచ్చు దాడి చేసిందని పాఠశాల నిర్వాహకులు దవాఖానలో వైద్యులకు, పోలీసులకు చెప్పారని తెలిసింది. కానీ అటవీశాఖ, వన్యప్రాణుల నిపుణులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. లోహిత్ గాయపడిన తీరును ఫొటోలో చూసిన అధికారులు అది కొండముచ్చు దాడి కానేకాదని తేల్చిచెప్తున్నారు. కొండముచ్చు గోర్లు అంత పదునుగా ఉండవని, అది గిచ్చితే గీరినట్టు పైపై గాయాలు మాత్రమే అవుతాయని, అంతలోతుగా దిగవని స్పష్టం చేస్తున్నారు. పైగా, ఒక మనిషిని గట్టిగా పట్టి అంతగా గాయపరిచే అవకాశమే లేదని అంటున్నారు. ఎలుగుబంటి దాడిచేస్తే మాత్రం ఆ స్థాయిలో గాయాలు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే, బాసర ఎఫ్ఆర్వో వేణుగోపాల్‌ను వివరణ కోరగా అసలు ఆ ప్రాంతంలో ఎలుగుబంట్ల కదలికలు లేవని చెప్పారు.
లోహిత్ కేసులో కీలక సాక్షి, సహచర విద్యార్థి బండారి మణికంఠ. గాయాలపాలై, రక్తపు మడుగులో పడి ఉన్న లోహిత్‌ను ముందుగా చూసింది అతడే. ఆ రోజు రాత్రి పాఠశాలలో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి మణికంఠ. కానీ ఏప్రిల్ 4న విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. గోదావరి ఘాట్‌ను శుభ్రం చేసేందుకు మణికంఠను ఆశ్రమ నిర్వాహకులే బలవంతంగా నీళ్లలోని మోటర్ దగ్గరకు పంపించారని తెలుస్తున్నది. మణికంఠ మోటర్ దగ్గర ఉండగానే స్విచ్ ఎవరు వేశారనేది తేలలేదు. మరోవైపు, మణికంఠ కేసులో ముగ్గురు యువతులు సాక్షులుగా ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. అంత ఉదయం ఆ అమ్మాయిలు అక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ వారు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఏప్రిల్ 4న తెల్లవారుజూమున 4గంటలకు మణికంఠ గోదావరి నీటిలోకి వెళ్తుంటే చూశామని, అతడు కరెంట్ షాక్‌తోనే చనిపోయాడని వాళ్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కానీ అదే సమయంలో పుష్కరఘాట్‌లో ఉన్న మాతాజీ తండ్రి, ఆయన మనవడు, పాఠశాలకు చెందిన మరొకరిని సాక్షులుగా ఎందుకు చూడలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
వేద పాఠశాలలో విద్యార్థిపై దాడి, మరో విద్యార్థి మృతి కేసులను పారదర్శకంగా విచారిస్తున్నాం. లోహిత్ కేసులో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నది వాస్తవం. కోలుకున్న లోహిత్ ఏమైనా చెప్తాడా? అని ఎదురుచూస్తున్నాం. కానీ తను ఏం చెప్పడంలేదు. లోహిత్ అన్ని విషయాలు చెప్తున్నాడు. కానీ సరిగ్గా ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే తనకు గుర్తులేదని, ఏం జరగలేదని చెప్తున్నాడు. అందుకే కేసు పెండింగ్‌లోనే ఉండిపోయింది. మణికంఠ మృతి కేసులో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? అనే కోణంలో విచారిస్తున్నాం. కేసులో చాలా అనుమానాలున్నాయి. అన్ని కోణాల్లో విచారిస్తున్నాం.