NH 65 | చిట్యాల, జూన్ 9 : జాతీయ రహదారి 65 (NH 65) పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న వారిపై దొంగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చోటుచేసుకున్నది. ఎస్సై సైదాబాబు కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం తొట్లపాలెం గ్రామానికి చెందిన పల్లెపు శ్రుతి శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్న పంచాక్షరి, వదిన అఖిల, వారి కుమారుడు దేవాంశ్తో కలిసి కారులో హైదరాబాద్కు బయల్దేరారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల ప్రాంతంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డుపై కారును నిలిపారు.
కారు డోర్లను లాక్ చేసుకొని లోపల నిద్రించారు. తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో టీషర్టులు వేసుకొని, ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బండరాయితో కారు అద్దాలు పగులగొట్టారు. కారులో నిద్రిస్తున్న శ్రుతి, పంచాక్షరిలను బయటికి లాగారు. వారిని విచక్షణా రహితంగా కొట్టి శ్రుతి మెడలోని తులం గ్రాముల బంగారు గొలుసు, అఖిల మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడు, పంచాక్షరి చేతికి ఉన్న తులం బంగారు ఉంగరాన్ని తీసుకొని పారిపోయారు. శ్రుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.