హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా టీడీపీ, వైసీపీ ఘర్షణలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతున్నది. ఇరుపార్టీల ఏజెం ట్లు, కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యా హ్నం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి వస్తున్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలుకాగా, కారు ధ్వంసమైంది. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జీ చేశారు.
దాడిని నిరసిస్తూ టీటీడీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. సోమవారం రాత్రి పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ జరుగగా మంగళవారం ఉదయం ఇరువర్గాలు కొట్లాడుకున్నారు. శావల్యాపురం మండలం పేరూరుపాడులో టీడీపీ నేతల కార్లను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చిత్తూ రు జిల్లా బైరెడ్డిపల్లి మండ లం బాపలనత్తంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు కత్తులు, రాళ్లతో దాడిచేశారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయా లు కావడంతో తిరుపతిలోని దవాఖానకు తరలించారు. అనంతపురం జిల్లా కొత్తూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడుల్లో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని తెల్లకూరులో గర్భిణిపైనా దాడి జరిగింది. రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె పంచాయతీ పరిధి బూరుగుమాకులపల్లెలో డ్రిప్ పరికరాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని తమ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి జరిగిందని పేర్కొంటున్నారు. స్థానికంగా భయాందోళన పరిస్థితులు తలెత్తడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇండ్లకే పరిమితమయ్యారు.