
వీణవంక, ఆగస్టు 23: విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ బ్రాంచి ఏఎస్సైపై బీజేపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. సాక్షాత్తు బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కండ్లముందే ఒకేసారి ఎనిమిది మందికిపైగా కార్యకర్తలు దాడి చేశారు. వీణవంక ఎస్సై కిరణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం వల్భాపూర్ గ్రామంలో సోమవారం మృతుల కుటుంబాల పరామర్శకు వెళ్లిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్.. స్థానిక నేత దొమ్మటి రాజమల్లు ఇంట్లో చేరికల కార్యక్రమం, సమావేశం పెట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచి ఏఎస్సై బాపురెడ్డి తన విధులు నిర్వహిస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా అతన్ని పట్టుకొని బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వల్భాపూర్‌కు చెందిన జీడి రాజు, దొమ్మటి రాజమల్లు, నలుబాల మధు, మారముల్ల సదయ్య, నామని విజేందర్, రాయిని శివయ్య, జీడి మోహన్, దొమ్మటి శ్రీనివాస్ మరికొందరు కలిసి ఏఎస్సై గల్లా పట్టుకున్నారు. చేతులతో అటూఇటూ గుంజుతూ నెట్టేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే చంపుతామని బెదిరించారు. బైక్‌ను ధ్వంసం చేశారు. బాపురెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.