ఆర్మూర్టౌన్, ఆగస్టు 11: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. అదే గ్రామానికి చెందిన ఏడుగురిపై ఆదివారం ఉదయం దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చేపూర్కు చెందిన వేల్పూల నర్సయ్య, కళ, పోసాని, లత, గంగారాం, భట్టు లాస్య, రాజగంగారాంపై ఉదయం 10.30 గంటలకు కుక్కలు ఒకదాని వెనుక మరోటి గుంపులుగా వచ్చి దాడి చేశాయి. దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నలుగురికి ఆర్మూర్ దవాఖానలో వైద్యం అందించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా దవాఖానకు తరలించారు. కుక్కలు వెంటపడి ప్రజలపై దాడులు చేస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.