Cyberabad Police | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): గత పదేండ్లలో శరవేగంగా వృద్ధిసాధించిన హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతలను ఇతర రాష్ర్టాల టెకీలు సైతం వేనోళ్ల పొగిడారు. కానీ గురువారం ఆ ఇమేజ్‌కు డ్యామేజ్ జరిగింది. పట్టపగలు ఫ్యాక్షన్ తరహాలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వాహనశ్రేణి నుంచి అనుచరులు ఫుట్‌బోర్డుపై చేతులు ఊపుకుంటూ హంగామా సృష్టించడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. దాడికి పక్కా స్కెచ్ వేశారని సంకేతాలు కనిపిస్తున్నా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చేతులెత్తేయటం సైబరాబాద్ పోలీసుల ప్రతిష్ఠకే మాయని మచ్చ. పోలీసుల నిఘా వైఫల్యం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. నిన్నటిదాకా అత్యంత సేఫెస్ట్ సిటీగా పేరొందిన హైదరాబాద్ నగరాన్ని దేశం ముందు తలదించుకునేలా చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గాంధీ దాడిచేసిన ఘటన హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డి కొండాపూర్‌లోని కొల్లా లగ్జరియ విల్లాలో ఉంటున్నారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ డివిజన్లో ఉన్న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో నివాసముంటారు. ఇది కూడా సైబరాబాద్ కమిషనరేట్‌లోని బాలానగర్ జోన్‌లోని కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోకే వస్తుంది. ఒకే కమిషనరేట్ పరిధిలో ఉన్న రెండు జోన్లలో ఉండే పోలీసులు సమన్వయం చేసుకోలేని పరిస్థితి సైబరాబాద్ పరిధిలో నెలకొన్నది. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు రెండు రోజులుగా సాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళతానని కౌశిక్‌రెడ్డి ముందుగానే ప్రకటించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌశిక్‌రెడ్డి నివాసం దగ్గరికి పోలీసులు చేరుకొని ఆయనను గృహనిర్బంధం చేశారు.
కౌశిక్‌రెడ్డిపై ఎమ్మెల్యే గాంధీ దాడి విషయంలో నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలోని పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. గాంధీ నివాసముండే వివేకానందనగర్.. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆపై ఆయన కేపీహెచ్‌బీ, మాదాపూర్ పోలీస్స్టేషన్లను దాటుకొని, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌కు వెళ్లి దాడి చేశారు. అంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగా, ప్రభుత్వ పెద్దల ఆదేశంతో మిన్నకుండిపోయారనేది బహిరంగ రహస్యం. హైదరాబాద్ ఐటీ కారిడార్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని ఇతర రాష్ర్టాల ఐటీ నిపుణులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు పట్టపగలు.. నగర రోడ్లపై భీతావహ వాతావరణాన్ని సృష్టించుకుంటూ, ఎమ్మెల్యేపై దాడి చేయడమంటే శాంతిభద్రతలు అత్యంత బలహీనంగా ఉన్నాయనే సంకేతాలు వెళ్లిపోయాయి. హైదరాబాద్‌లో వరుస హత్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు కౌశిక్‌రెడ్డిపై దాడి సైబరాబాద్ ప్రతిష్ఠకు మచ్చలా మారింది.
తానే కౌశిక్‌రెడ్డి ఇంటికి మధ్యాహ్నం 12 గంటలకు వెళతానని గాంధీ 3 గంటల ముందుగానే ప్రకటించారు. పోలీసులు వివేకానందనగర్‌లోని ఆయన నివాసం వద్ద కూడా మోహరించి, గాంధీని కూడా గృహనిర్బంధం చేయాలి. కానీ ఇక్కడే పోలీసుల వైఫల్యం బట్టబయలైంది. ప్రభుత్వ పెద్దల ఆదేశంతో తమ విధి నిర్వహణను పక్కనపెట్టిన పోలీసులు.. గాంధీని అదుపులోకి తీసుకోకపోగా, కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లేందుకు అన్నిరకాలుగా మార్గాన్ని సుగమం చేశారు. గాంధీ.. తన ఇంటి వద్దకు అనుచరులను పిలిపించుకొని, కొండాపూర్‌కు ఎలా వెళ్లాలి? ఎలా దాడి చేయాలి? అనే ప్రణాళికను రూపొందించుకున్నారు. గాంధీ ఇంటి వద్ద ఉన్న పోలీసుల ముందే అనుచరులు రావడం, సంచుల్లో కోడిగుడ్లు, టమాటాలు నింపడం, వాహనాల్లో కర్రలు, కత్తులు వేసుకోవడం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల సమక్షంలోనే, వారి సహకారంతోనే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగిందనేది బయటి ప్రపంచానికి తెలిసింది. సైబరాబాద్ పోలీసుల ప్రతిష్ఠ గాలిలో కలిసిపోయింది.