హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి బుద్ధులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, అడుగడుగునా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న తమ నాయకుడు కేటీఆర్ కాన్వాయ్‌పై గతంలో విద్యానగర్‌లో కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆయన గుర్తుచేశారు. గతంలో ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావు కారుపైన దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న సీఎం వెంటనే రాజీనామా చేయాలని సతీశ్ డిమాండ్ చేశారు.