Tribal Welfare School | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 12: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో దారుణం జరిగింది. విద్యార్థినులు ఆలస్యంగా స్నానాలు చేస్తున్నారనే నెపంతో వారిపై పీఈటీ జ్యోత్స్న విచక్షణా రహితంగా దాడి చేసింది. అంతేకాదు.. బాత్రూంల డోర్లు పగులగొట్టి, స్నానపు గదుల్లోనే సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తూ కర్రతో చితకబాదింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు గురువారం తెల్లవారుజామున కళాశాల నుంచి బయటకొచ్చి బద్దెనపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తెల్లవారుజామున విద్యార్థులు ధర్నా చేయడంతో స్థానికులు మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పీఈటీని సస్పెండ్ చేయాలని, ఎక్కడా పనిచేయకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఎంఈవో రఘుపతి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే డీఈవో రమేశ్‌కుమార్‌తో ఫోన్లో సమస్యను వివరించగా.. పీఈటీ జ్యోత్స్నను రిమూవ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారని డీఈవో తెలిపారు. అనంతరం విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఎంఈవో రఘుపతి పీఈటీ జ్యోత్స్నను రిమూవ్ చేశామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్వీ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, జై భీం ఆర్మీ సంఘాల నేతలు కళాశాలకు చేరుకుని ఆందోళన చేశారు. పీఈటీ జ్యోత్స్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపాల్‌ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూ సందర్శించారు. పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపాల్‌కు సూచించారు. పోలీసులు పీఈటీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టు తెలిపారు.