రాష్ట్రంపై సైబర్ నేరగాళ్ల దండయాత్ర కొనసాగుతున్నది. అమాయక ప్రజలను ఆన్లైన్ దొంగలు లూటీ చేస్తున్నారు. కేసుల పేరిట భయపెడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. తెలంగాణలో సైబర్మోసగాళ్లు రోజుకు సుమారు రూ.5కోట్ల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్టు సమాచారం.
Cyber Crime | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రోజుకురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దీనిపై పౌరులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. ఏదో ఒక రూపంలో, కొత్త ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు రోజుకు కనీసం రూ.5కోట్ల వరకు రాష్ట్రం నుంచి కొల్లగొడుతున్నారు. మోసపోయామని 1930కి లేదా పోలీసులకు బాధితు లు చెబితేనే రోజుకు రూ.5కోట్ల దోపిడీ వెలుగులోకి వస్తున్నది. ఇంకా సైబర్ మోసగాళ్ల మాయలోనే ఉండి, వారు చెప్పిందే నిజమనుకొనే వారు ఎందరో? అనేది ఆందోళన కలిగిం చే అంశం. ప్రధానంగా ‘డిజిటల్ అరెస్టు’ పేరిట ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ డిజిటల్ అరెస్టుల్లో అత్యధిక శాతం వృద్ధులే ఉండటం విస్తుపోయే అంశం. తెలంగాణలో ఈ ఏడాది 10 నెలల్లో 3,500 డిజిటల్ అరెస్టులు జరగగా.. వాటి ద్వారా సుమారు రూ.240కోట్ల వరకు కొల్లగొట్టారు. పది నెలల్లోనే 3,238 మోసాలు జరగగా.. బాధితులు వేలల్లో ఉన్నారు. 3,500 కేసుల్లో బాధితుల్లో 60శాతం వరకు వృద్ధులు ఉన్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వర్గాలు తెలిపాయి.
ట్రై కమిషనరేట్లలోనే అధికం
పోలీసుల అవతారంలో వాట్సాప్ కాల్ చేసి మీ కొడుకు/కూతురు లేదా మనువళ్లు, మనవరాళ్లు డ్రగ్స్, మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారంటూ దొంగ ఎఫ్ఐఆర్లు చూపించి.. బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా కేసులు రాజధానిలోని ట్రై కమిషనరేట్ల పరిధిలో అందులోనూ ఉద్యోగస్తులు అధికంగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా నమోదుతున్నాయి. పది నెలల్లో ఈ మూడు కమిషనరేట్లు కలిపి 1140 కేసుల్లో రూ.121.31 కోట్లను బాధితులు మోసపోయారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సైబర్ నేరగాళ్ల బాధితుల నుంచి 1200 కాల్స్ వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.