ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలో వివాదాలకు విజయలక్ష్మీ ఆస్పత్రి( Vijaya Laxmi Hospital ) కేంద్ర బింధువుగా మారింది. ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఓ గర్భిణీ ప్రాణాపాయ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న ఓ గర్భిణీ ఇద్దరు కవల పిల్లలను( Twins ) కడుపులోనే పోగొట్టుకుంది.
ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ కవలల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం ఆస్పత్రి దుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్రావు ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణ జరిపి ఆస్పత్రిని సీజ్చేశారు. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి కీర్తి ఐదు నెలల గర్భవతి. గర్భం దాల్చిన నాటినుంచి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మంచాల రోడ్డులోగల విజయలక్షీ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయించుకుంటోంది.
ఆమె గర్భంలో కవలలు ఉండటంతో గర్భసంచికి నెలరోజుల క్రితం కుట్లు వేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తీవ్ర ఇబ్బందితో ఆస్పత్రికి రాగా వైద్యులు అందుబాటులో లేకపోవటంతో స్టాప్ నర్సులు గైనకాలజిస్టు అనూషరెడ్డి ఫోన్లో తెలిపిన విధంగా నర్సులు మరోమారు కుట్లు వేశారు. ఉదయం 11గంటల వరకు వైద్యురాలు రాకపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి, కుట్లు తెగిపోయి గర్భంలో ఉన్న కవలలు మృతిచెందినట్లు గుర్తించారు.
గర్భంలోనే కవలలు మృతిచెందినప్పటికీ ఆస్పత్రికి సంబంధించిన రూ.30వేల బిల్లు చెల్లించి వెళ్లిపోవాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం, స్టాప్ నర్సుల తెలిసి తెలియని వైద్యంతో గర్భంలోనే కవలలు చనిపోయారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులుకు సర్దిచెప్పారు. అర్హతలేని వైద్యులతో అమాయకపు ప్రజలకు చికిత్సలు చేయించి లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్పత్రిని సీజ్చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు
ఐదునెలల గర్భంలోనే ఇద్దరు పిల్లలు మృతిచెందిన సంఘటనపై ఆస్పత్రిలో విచారణ జరిపిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్రావు ఆస్పత్రిని సీజ్చేశారు. ఈ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న పలువురు రోగులను ఇతర ఆస్పత్రులకు రెఫర్చేసి తరలించారు. అనంతరం ఆస్పత్రిని సీజ్చేశారు. అర్హతలేకుండా వైద్యచికిత్సలు నిర్వహించటం, తీవ్ర ఇబ్బందితో ఆస్పత్రికి వచ్చిన గర్బిణీపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.