నిజాంపేట్, సెప్టెంబర్ 5: ఇద్దరు పిల్లలతో పాటు తల్లి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయాణఖేడ్ నియోజక వర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది, స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్‌కు చెందిన బూసి సాయవ్వ-రాముల కుమార్తె ప్రమీల (23)ను నిజాంపేట్ మండలం దామరచెరువుకు చెందిన సంగమేశ్‌కు ఇచ్చి నాలుగేండ్ల క్రితం వివాహం చేశారు. వారికి ధనుశ్(3), సూర్యవంశీ (45 రోజులు) ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈ నెల 4న ప్రమీలను ఆమె భర్త దామరచెరువు నుంచి నిజాంపేట్‌లో అత్తగారి ఇంటి వద్ద దించి వెళ్లాడు. శుక్రవారం ప్రమీలతో పాటు ధనుశ్, సూర్యవంశీ విగతజీవులై పడిఉన్నారు. రాములు పెద్దకుమారుడు సాయంత్రం వచ్చి ఇంట్లో చూడగా ప్రమీల దూలానికి చీరతో ఉరివేసుకుని కనిపించింది. ఈ వార్త విన్న సాయవ్వ-రాములు నిర్ఘాంతపోయారు. పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్యచేసి ప్రమీల ఆత్మహత్య చేసుకుందా, లేక ముగ్గురినీ ఎవరైనా హత్యచేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.