ఊట్కూర్ : పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో కష్ట సుఖాలు సహజమని, అలాగే క్రీడకారులకు గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయని బిజ్వారం అంబత్రయ క్షేత్రం శక్తిపీఠం వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ (Aditya Parashri Swamiji) స్వామిజీ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు ( Utkoor) మండలం బిజ్వార్ గ్రామంలోని అంబత్రయ క్షేత్రం శక్తిపీఠంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ( Shootling Ball ) పోటీలలో గెలుపొందిన విజేతలకు శనివారం ట్రోఫీ, మెడల్స్ ను అందజేశారు.
ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ గోపాలం మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఐలయ్య మాట్లాడుతూ ఈ పోటీల్లో క్రీడా ప్రతిభను చాటిన బాలబాలికలను ఎంపిక చేసి మే నెల 9 నుంచి 11 వరకు చెన్నై నగరంలో జరిగే జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు పంపుతామని తెలిపారు.
రాష్ట్ర స్థాయి బాలుర విభాగంలో గద్వాల జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానం, సంగారెడ్డి ద్వితీయ స్థానం, నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులు తృతీయ స్థానం సాధించారు. బాలికల విభాగంలో ప్రథమ స్థానం కొత్తగూడెం జిల్లా విద్యార్థులు, ద్వితీయ స్థానం ఆసిఫాబాద్, తృతీయ స్థానం లో నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులు నిలిచారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్య ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా డివైస్ ఓ వెంకటేష్ శెట్టి, పీఈటీలు మల్లికార్జున్ ,విష్ణు వర్ధన్ రెడ్డి, ఎన్ రాఘవేందర్, యాదయ్య, పవన్, శిరీష , మంజునాథ్, కుమార్, రాజేశ్వర్ గౌడ్ , వర్మ, శ్రీనాథ్, గురు వయ్య, ప్రసాద్, ఆంజనేయులు, సాదిక్ పాల్గొన్నారు.