సంగారెడ్డి(నమస్తే తెలంగాణ) : అంతరిక్షంలో వినిపిస్తున్న లయబద్ధమైన శబ్దాల (యూనివర్స్ హమ్మింగ్) వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రోఫిజిస్టులు చేధించారు. తక్కువ పౌనఃపున్యం కలిగిన గురుత్వాకర్షణ తరంగాలు ఇందుకు కారణమని తేల్చారు. దీనిపై భారత్, జపాన్, యూరప్‌కు చెందిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం పరిశోధన జరిపింది. ఈ పరిశోధన బృందంలో సంగారెడ్డి జల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఫిజిక్స్ హెడ్ డా.శంతను దేశాయ్, విద్యార్థులు అమన్ శ్రీవాస్తవ, దివ్యాన్ష్ ఖర్బండా, శ్వేత అరుముగం, ప్రజ్ఞ మామిడిపాక ఉన్నారు.
ఐఐటీ హైదరాబాద్‌లోని నేషనల్ సూపర్ కంప్యూటర్ను ఉపయోగించి డాటాను విశ్లేషించారు. కృష్ణబిలాల జతల నుంచి గురుత్వాకర్షణ తరంగాలతో ఏర్పడుతున్న ప్రకంపనాలు దీనికి కారణమని సైంటిస్టులు గుర్తించారు. దీనిపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి హర్షం వ్యక్తం చేశారు.