హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మెటిక్ కిట్లకు బదులు చార్జీలు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభు త్వం ఆచరణలో విఫలమైంది. 2025-26 విద్యాసంవత్సరం ముగిసి మూడు నెలలు అవుతున్నా చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. అటు కిట్లు ఇవ్వకుండా, ఇటు నగదు ఖాతా ల్లో వేయకుండా జాప్యం చేస్తున్నది. దీంతో సర్కార్ వైఖరిపై నిరుపేద విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని మండిపడుతున్నారు. పది నెలలుగా పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనారి టీ, సంక్షేమ హాస్టళ్లకు చెందిన 6 లక్షల మంది కి టూత్‌బ్రష్, పేస్ట్, టంగ్ క్లీనర్, బాత్ సోప్, షాంపు, హెయిర్ ఆయిల్ ఇలా 12 వస్తువులతో కూడిన కాస్మెటిక్ కిట్‌ను ప్రతినెలా అందజేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిఏడాది ఇదే పద్ధతిలో కిట్లు పంపిణీ చేశా రు. కానీ అక్రమాలు జరుగుతున్నాయనే నెపంతో గత విద్యాసంవత్సరం నుంచి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు స్మార్ట్‌కార్డు లు అందజేయాలని నిశ్చయించారు. మూడో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థినులకు రూ. 175, విద్యార్థులకు రూ. 150, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థినులకు రూ. 275, విద్యార్థులకు రూ.200 చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. జూన్ నెల చివరి వరకు నగదు విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. స్మార్ట్‌కార్డు ద్వారా మహిళాసంఘాల మొబైల్ సెంటర్లలో సబ్బులు, పౌడర్ ఇతరత్రా కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేయాలని నిర్దేశించారు.
డీబీటీ అమలు కోసం 2025 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థుల ఖాతాల వివరాలు సేకరించారు. గత ఏడాదికి సంబంధించి నయాపైసా కూడా తమ ఖాతాల్లో జమ చేయలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. టెన్త్, ఇంటర్ చదువులు పూర్తిచేసిన వేలాది మంది ఇప్పటికే సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లిపోయారని పేర్కొంటున్నారు. వారికి అసలు కాస్మెటిక్ చార్జీలు ఏ విధంగా చెల్లిస్తారనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యూనియన్ల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కిట్లు ఇవ్వకుండా, చార్జీలు చెల్లించకుండా నిరుపేద విద్యార్థుల ను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.