హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న కేసులో తమను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతించాలని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం హైకోర్టును కోరింది. ఘటనాస్థలంలో నిందితులు ఎదురుతిరిగినప్పుడు పోలీసులు ఆత్మరక్షణ చర్యలు తీసుకోకతప్పదని సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో సంఘం వాదనలు కూడా వినాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, వాదనలు వినిపించేందుకు అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది.
ఈ కేసులో సంఘాన్ని ప్రతివాదిగా చేర్చాలో లేదో వాదనల తర్వాత తగిన నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేసింది. షాద్‌నగర్ సమీపంలో 2019 డిసెంబర్ 6న జరిగిన దిశ ఎన్కౌంటర్ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులైన పోలీసులపై కేసుల నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులోని వేరే కేసు నిమిత్తం అడ్వొకేట్ జనరల్ ఢిల్లీ వెళ్లారని, ఏజీ వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ఎం రూపేందర్ కోరగా, అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది.