కామారెడ్డి, మే 23 : కామారెడ్డి కోర్టులో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కానిస్టేబుల్ ఓ కేసు విషయమై బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో నమోదైన ఓ చీటింగ్ కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్నది.
ఈ కేసును త్వరగా పూర్తి చేయాలంటే కామారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న గుగులోత్ అశోక్ శివరాంనాయక్, కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నిమ్మ సంజయ్ రూ.15వేలు లంచం ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశారు. చివరికి వారు రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం కోర్టు ఆవరణలో అశోక్ రూ.10వేలు లంచం ఇస్తుండగా శివరాం నాయక్, సంజయ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంట్లో సోదాలు చేపట్టినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏపీపీ, కానిస్టేబుల్‌ను హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరుస్తామని చెప్పారు.