అలంపూర్, జూన్ 12 : లంచం తీసుకుంటూ పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండో ఏసీబీకి పట్టుబడిన ఘటన జోగుళాంబగద్వాల జిల్లాలో జరిగింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు.. ఎర్రవల్లి మండలం బీచుపల్లి 10 బెటాలియన్‌లో గోవర్ధన్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తనకు అనుకూలంగా క్లియరెన్స్ సర్టిఫికెట్ రిపోర్ట్ ఇవ్వడానికి కేసులో విచారణాధికారిగా ఉన్న అసిస్టెంట్ కమాండో నరసింహస్వామిని సంప్రదించగా రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. కమాండో సూచనమేరకు ఆయన స్నేహితుడు, ఏపీలోని కర్నూల్‌కు చెందిన రిటైర్డ్ ఏఆర్ ఎస్సై అబ్దుల్ వహబ్‌కు బుధవారం ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నగదు అందజేస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ పట్టుకున్నారు. నరసింహస్వామి, అబ్దుల్ వహబ్‌ను అదుపులోకితీసుకొని విచారణ జరుపుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.