Assembly Budget Session | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : ‘మా ప్రాంతంలో మంచినీళ్లు రావడం లేదు.. మా దగ్గర సాగునీళ్లు పారడం లేదు.. మా నియోజకవర్గంలో కరెంట్ కోతలతో సతమతమవుతున్నాం.. రైస్ మిల్లులు నడవడం లేదు.. మా ఏరియాలో మిషన్ భగీరథ బంద్ అయింది.. తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నరు.. మా ప్రాంతంలో పచ్చని పంటలు ఎండుతున్నయ్..’ ఇలా తాగు, సాగునీటి సమస్యలతో మంగళవారం అసెంబ్లీ హోరెత్తింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 26 మంది ఎమ్మెల్యేలు వ్యవసాయ సంక్షోభంపై ఫైరయ్యారు. తాగు, సాగునీటి సమస్యతోపాటు కరెంటు ఇక్కట్లపై గగ్గోలు పెట్టింది ప్రతిపక్ష సభ్యులు కాదు.. అసెంబ్లీ సాక్షిగా సర్కారు తీరును ఎండగట్టింది అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రైతులు ఆందోళనకు సిద్ధమవుతుండగా, ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారని, తక్షణమే యుద్ధప్రాతిపదికన తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే జీరో అవర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుమతి ఇచ్చారు. తాగు, సాగునీరు, కరెంటు, కాల్వల మరమ్మతు సమస్యలతో అసెంబ్లీ దద్దరిల్లింది.
మిషన్ భగీరథ బంద్ అయిందని, ప్రజలకు తాగునీరు అందడం లేదని అధికార కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. ‘ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మా మునుగోడు నియోజకవర్గం. ఎండల తీవ్రత వల్ల నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి కూడా కటకట ఏర్పడింది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చింది. వేల కోట్లతో పైలాన్ కట్టిన చౌటుప్పల్ పట్టణంలోనే ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. 2011 జనాభా లెకల ప్రకారం చౌటుప్పల్ పట్టణానికి తాగునీటి కేటాయింపులు జరిగా యి. అకడి పరిశ్రమల వల్ల జనాభా పెరిగింది. జనాభా ప్రాతిపదికన నీటి కేటాయింపులు లేవు. తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సత్వరమే తాగునీటి సమస్యను పరిషరించాలి’ అని రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని చర్యలు తీసుకొంటే నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. పాకాల చెరువు కాల్వల మరమ్మతులు చేస్తే చివరి అయకట్టుకు సాగునీరు అందుతుందని, వేసవిలో మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
భీమ్గణపూర్ చెరువును అభివృద్ధి చేయాలని భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. రూ.102 కోట్లు ఖర్చు చేస్తే భీమ్ గణపూర్ చెరు వు ద్వారా 58 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. తన నియోజకవర్గంలో కొత్త కాల్వలకు భూములు సేకరించవద్దని పాత కాల్వలకు మరమ్మతులు చేస్తే ప్రభుత్వానికి రూ.200 కోట్లు వరకు మిగులుతాయని సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు.
మెట్పల్లి దవాఖానలో పెచ్చులూడుతున్నాయని, కొత్త భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరారు. తన నియోజకవర్గంలో 350 మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు. సాగునీటి కాలువ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.
కొండగల్ నియోజవర్గం అభివృద్ధికి ఇచ్చినట్టుగా తన నియోజకవర్గానికి సైతం రూ.1000 కోట్లు కేటాయించాలని హుజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. తనను ఏదో చేసి సభను సస్పెండ్ చేయించాలని చూస్తున్నారని వాపోయారు. కాలువల్లో నీళ్లు రావడం లేదని, పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని, తక్షణమే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీబీఎం ద్వారా గ్రామాలకు నీళ్లు అందడం వాపోయారు.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఉద్యమంలో అనేక మంది జైళ్లకు వెళ్లారని, కాంగ్రెస్ హామీ మేరకు వారిని ఆదుకోవాలని కోరారు.
అప్రకటిత విద్యుత్తు కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంటు కోతలు విధిస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయని, కరెంట్ కోతలతో మిల్లులు నడుస్తలేవని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కో రారు. డిప్యూటీ సీఎం విద్యుత్తు శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తీర్చాలని కోరారు. వాడపల్లి దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో లింకురోడ్లకు నిధులు ఇవ్వాలని కోరారు.
సభ్యులు లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వ అసమర్థపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో జీరో అవర్‌లో సభ్యులు ఎక్కువగా తాగు, సాగునీటి సమస్య గురించి మాట్లాడారని గంగుల కమలాకర్ చెప్పారు. తమ పదేండ్ల పాలనలో ఎప్పుడూ ఇలా తాగు, సాగునీటి సమస్యలపై సభ్యులు ప్రశ్నించే పరిస్థితి ఉత్పన్నం కాలేదని గుర్తుచేశారు. ‘అధ్యక్షా.. ఈ రోజు ఒకటి గమనించాలి. జీరో అవర్‌లో ఎమ్మెల్యేలంతా తాగు, సాగునీటి ఇబ్బంది గురించి మాట్లాడారు. మా రైతుల పంట పొలాలు ఎండిపోయాయని ప్రభుత్వాన్ని వేడుకున్నారు అధ్యక్షా. పదేండ్ల మా పాలనలో ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ రాలేదు. అధ్యక్షా. మా కరీంనగర్లో.. ’ అని మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పోడియం దగ్గరకు వెళ్లి రిక్వెస్ట్ చేయడంతో ఆ తర్వాత గంగులకు మళ్లీ అవకాశం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తాగు, సాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నందున వాటిపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు. సాగునీరు అందక, పంటలు ఎండుతున్నాయని ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తే రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారు మైక్ కట్ చేసిందని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు.