హైదరాబాద్, నవంబర్ 3 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం విషయంలో తామేమీ తక్కువ కాదని ఈ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బీజేపీ మరోసారి రుజువు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కుటంబ రాజకీయాలు నడుస్తున్నాయంటూ సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసే కాంగ్రెస్, బీజేపీలు తమ వద్ద కొచ్చేసరికి ‘చెప్పేటందుకే నీతులు’ అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మధ్య ప్రదేశ్‌లో ఈ రెండు పార్టీలు 40 మందికి పైగా, రాజస్థాన్‌లో ఇప్పటికి 29 మంది వారసులను ఎన్నికల బరిలోకి దించాయి.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తమ వారికి అధిక టికెట్లు కేటాయించింది. మాజీ సీఎం కైలాష్ జోషీ కుమారుడు దీపక్ జోషి దేవాస్, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ సింగ్, దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్, మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత సుభాష్ యాదవ్ కుమారుడు సచిన్ యాదవ్‌లకు ఆ పార్టీ టికెట్లిచ్చింది. మరోవైపు బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర సఖ్లేచా కుమారుడిని ఖాతేగావ్ అసెంబ్లీ బరిలో దించింది. మాజీ ముఖ్యమంత్రి గోవింద్ నారాయణ సింగ్ కుమారుడు ధృవ్ నారాయణ్ సింగ్, మనమడు విక్రమ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వా అల్లుడు సురేంద్ర పటా, మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి అల్లుడు రాహుల్ సింగ్ లోథీ, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ కోడలైన కృష్ణా గౌర్, మాజీ ప్రతిపక్ష నాయకుడు నాయకుడు సత్యదేవ్ కటారే కుమారుడు హేమంత్ భిండె, కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్‌లకు బీజేపీ అసెంబ్లీ టికెట్లు కేటాయించింది.
రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలు కలిపి 29 మంది వారసులను ఎన్నికల రంగంలోకి దింపాయి. ఇప్పటికి ప్రకటించిన అభ్యర్థుల్లో బీజేపీకి చెందిన ప్రముఖ నేతల బంధువులు 11 మంది ఉండగా, కాంగ్రెస్ అభ్యర్ధులు 18 మంది రాజకీయ కుటుంబాల వారే.