హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ చేపడతారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభ సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, శాసనమండలిలోనూ ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ టి రత్నాకర్, ఎం రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానం తర్వాత సభను వాయిదా వేయనున్నట్టు సమాచారం. సభ వాయిదాపడ్డ తర్వాత అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించి ఇటు అసెంబ్లీలో, అటు కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.
ఈ సమావేశాలను సాధారణ వర్షాకాల సమావేశాలుగా కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించే ప్రత్యేక సమావేశాలుగా మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టి ప్రభుత్వం తరఫున చర్చను ప్రారంభించే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ప్రతిపక్షాలకు సమయం ఇచ్చి ఒకటిరెండు రోజుల్లోనే చర్చను ముగించే యోచనతో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా మూడు నుంచి అయిదు రోజులకు మించకుండా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేవలం పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై మాత్రమే చర్చించాలని, మిగిలిన అంశాలను మరోసారి చర్చిద్దామన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు చెప్తున్నారు. శనివారం జరిగే బీఏసీలోనే నివేదికను ఎప్పుడు పెట్టాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఆదివారం సభ నిర్వహించాలనుకుంటే ఆదివారమే నివేదికను ప్రవేశపెడతారు.
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
ఈ సమావేశాల్లోనే శాసనసభ ఉపసభాపతిని ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ను డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసింది. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శాసనసభ స్పీకర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌తోపాటు నామినేషన్ల ప్రక్రియ కూడా చేపడతారు. ఆ వెంటనే ఉపసభాపతి ఎంపికను పూర్తిచేసి ప్రకటిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను కూడా ఇదే సమావేశాల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
వరదలు.. యూరియాపై చర్చ ఉండదా?
రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య యూరియా కొరత. ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వం చర్చించే అవకాశం కనిపించడంలేదు. ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈసారి కేవలం పీసీ ఘోష్ నివేదికపైనే చర్చిస్తారని చెప్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేనివిధంగా, కనీవిని ఎరుగని రీతిలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందిపడుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతీ రైతు యూరియా కష్టం ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి ముఖ్యమైన సమస్యలను ప్రతిపక్ష పార్టీలు శాసనసభలో లేవనెత్తే అవకాశం ఉన్నది. అయితే, ప్రభుత్వం మాత్రం రైతుల కష్టాలు, తన వైఫల్యాలపై చర్చించేందుకు ఏమాత్రం సుముఖంగా ఉన్నట్టు కనిపించడంలేదు. యూరియా కొరత రాష్ర్టాన్ని గత నెల రోజులకుపైగా వేధిస్తున్నది.
ఆగస్టు ముగిసిపోతున్నా ఇంకా యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతున్నది. గతంలో ఎన్నడూలేనివిధంగా వర్షాలు పడటంతో రాష్ట్రంలో 15 జిల్లాలకుపైగా ప్రజలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయకచర్యలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల్లో ప్రజలు తమ గురించి చర్చ జరగాలని కోరుకుంటున్నారు. కానీ, ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ అంశంపై కూడా చర్చించేలా కనిపించడంలేదు. దీంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్, దవాఖానల్లో వసతులు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, విద్యార్థులు దవాఖానల పాలవ్వడం, పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడం, జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం సహా అనేక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. కానీ, ప్రభుత్వం వీటిపై చర్చించేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది.
వినాయక నిమజ్జనంలోపే సమావేశాల ముగింపు
శనివారం ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలను మూడు లేదా అయిదు పనిదినాల్లోపే ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకరోజు మాగంటి గోపినాథ్ మృతిపై సంతాప తీర్మానం, ఇంకో రెండు రోజులు కాళేశ్వరం కమిషన్‌పై చర్చ పెట్టి ముగించాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నది. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం నాటికి సమావేశాలను ముగించాలని యోచిస్తున్నారు. పోలీసు బందోబస్తు తదితర కారణాలను కూడా చూపించి సభను నిరవధికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
42% బీసీ రిజర్వేషన్లపై జీవో- అసెంబ్లీలో ప్రకటన
శాసనసభా సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం జరగనున్నది. అయితే, తొలుత క్యాబినెట్ భేటీని సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, అసెంబ్లీలోని కమిటీ హాలుకు మార్చారు. సుమారు 20 అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. కొన్ని పనులకు రాటిఫికేషన్తోపాటు స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారని తెలుస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసే అంశంపై శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా, ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేసి, చర్చ చేపట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. క్యాబినెట్ ఆమోదం పొందిన తరువాత బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఏర్పాట్లపై సమీక్షించిన చైర్మన్, స్పీకర్
శనివారం నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, డీజీపీ జితేందర్, ఏడీజీ మహేశ్‌భగవత్, హైదరాబాద్ సిటీ అడిషనల్ సీపీ విక్రంసింగ్‌మాన్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు పంపాలని, ఎక్కడా నిర్లక్ష్యం చేయవద్దని ఈ సందర్భంగా అధికారులకు స్పీకర్, చైర్మన్ సూచించారు.