హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్, స్పీకర్ శనివారం అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసనపరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండాప్రకాశ్, కౌన్సిల్ చీఫ్ విప్ పట్నంమహేందర్రెడ్డి తదితరులు ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, హోంశాఖ ముఖ్యకార్యదర్శి శిఖాగోయల్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, అసెంబ్లీ, కౌన్సిల్ కార్యదర్శులు రేండ్ల తిరుపతి, డాక్టర్ వీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచించారు. గౌరవ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, వారికి అందించే మెటీరియల్‌ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ముందస్తుగానే సమర్పించాలని ఆదేశించారు. ఆయా శాఖలపై చర్చ జరిగే సమయంలో సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు సభలో అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు సహకరించాలని చెప్పారు. పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టి సభ లోపల, బయట ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని పోలీసు శాఖకు దిశానిర్దేశం చేశారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఉభయ సభల సమావేశాలు రాజకీయంగా హాట్‌హాట్‌గా జరిగే అవకాశాలు ఉన్నందున పోలీసు శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. సభల నిర్వహణకు ప్రతి విభాగం నోడల్ అధికారులను నియమించుకోవాలని, అధికారులు గతంలో కంటే వేగంగా స్పందించాలని సూచించారు. ధర్నాలు, రాస్తారోకోల వంటి ఆందోళనలతో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అసెంబ్లీ అధికారులకు చేరవేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.