హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తేతెలంగాణ): ‘కమిటీలు.. కమిషన్లు.. సిట్లు.. సెట్లు’.. దాదాపు మూడేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాడుతున్న పాటలే ఇవి. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పడుతున్న పాట్లు ఇవి. ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో ఆగ్రహం పెరిగినప్పుడల్లా వారి దృష్టి మరల్చేందుకు ఆడుతున్న నాటకాలివి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు నెలలకో కమిటీ, ఆరు నెలలకో కమిషన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ ముఖ్య నేతలే లక్ష్యంగా కుట్రలకు దిగుతున్నది.
కేసులు, విచారణలు, సిట్లు, సెట్ల పేరుతో బురద చల్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ప్రజాసమస్యలు లేవనెత్తినప్పుడల్లా, ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ప్రశ్నించినప్పుడల్లా ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నది. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర కీలక నేతలను కుట్రల్లో ఇరికించేందుకు.. తెలంగాణ తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు.. తాజాగా 22-ఏ నిషేధిత భూముల జాబితా వరకు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నది. దాదాపు మూడేండ్ల కాలంలో కేసుల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప చేసిందేమీ లేదని, తేల్చిందీ ఏమీ లేదని తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు.
ఘోష్ కమిషన్‌తో మొదలు
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ మొదటి నుంచీ ప్రచారం చేస్తున్నది. దీనికి తగ్గట్టే అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంశాన్నే ముందు వేసుకున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణలోపాలపై విచారణ జరిపేందుకు అంటూ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో 2024 మార్చి 14న ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. మొదట 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కానీ, పలుమార్లు ఆ గడువును పొడిగించింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఐఏఎస్‌లు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, రజత్‌కుమార్, ఎల్అండ్టీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు సహా 114 మందిని ఆ కమిటీ విచారించింది.
2025 జూలై 31న ఘోష్ కమిషన్ 700 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ తమ వాదనలు వినకుండానే ఏకపక్షంగా వ్యవహరించిందని, కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని స్టే విధించింది. ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో నివేదికలోని పాక్షిక అంశాలను బయటపెట్టి కేసీఆర్ సర్కార్‌పై నిందారోపణలు చేసింది. అవినీతిని నిరూపించడం చేతగాక సీబీఐకి సిఫారసు చేసి కేంద్రం కోర్టులో బంతిని నెట్టి ప్రజలను తప్పుదోవపట్టించి తప్పించుకున్నది.
డైవర్షన్ అస్త్రంగా ‘ఫోన్ ట్యాపింగ్’
కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకొని రెండున్నరేండ్లుగా ప్రభుత్వం ఆడుతున్న డైవర్షన్ డ్రామా ‘ఫోన్‌ట్యాపింగ్’. ఈ వ్యవహారంలో 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలతోపాటు వ్యాపారులు, సినీనటులు, జడ్జిలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. దీనిపై విచారించేందుకు 2024 మార్చి 16న అప్పటి హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను (సిట్) ఏర్పాటుచేశారు. విచారణ వివరాలను ప్రభుత్వ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. నేరానికి పాల్పడట్టు, శిక్ష తప్పదని దుష్ప్రచారం చేశారు.
ఆ తర్వాత హైదరాబాద్ సీపీగా ఉన్న డీజీ ర్యాంకు అధికారి అయిన సజ్జనార్ నేతృత్వంలో రెండో సిట్ ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో 2025 జనవరి 20న హరీశ్‌రావును, జనవరి 23న కేటీఆర్‌ను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులను సైతం విచారించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న, క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించి 14 రోజుల కస్టడీ విధించి జైలుకు పంపారు. 2025 డిసెంబర్ 25న విచారణ చేశారు. ఇప్పటికీ ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను ఇరికించేందుకు విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం తరచూ దీనిని ఓ డైవర్షన్ అస్త్రంగా వాడుతూనే ఉన్నది.
విద్యుత్తు కొనుగోళ్లపై కమిషన్
ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, యాదాద్రి, భదాద్రి పవర్ ప్లాంట్ల టెండర్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. విచారణ కోసం 2024 మార్చి 14న హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఐఏఎస్‌లు ఎస్కే జోషీ, అజయ్‌మిశ్రా, సురేశ్ చందాతోపాటు 25 మందికి అదే ఏడాది జూన్ 11న నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. అయితే నర్సింహారెడ్డి కమిషన్‌కు విచారణ అర్హత లేదని కేసీఆర్ జూన్ 14న లేఖ రాశారు.
కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జూన్ 26న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూలైలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాజకీయ కక్షతోనే కమిషన్ వేశారని అభిప్రాయపడింది. విచారణలోని అంశాలను జస్టిస్ నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించడం చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. ఆయనను తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ బీ లోకూర్‌ను కమిషన్ చైర్మన్‌గా నియమించారు. కమిషన్ 2024 అక్టోబర్‌లో 114 పేజీల నివేదిక సమర్పించింది. అయినా ఏమీ తేలకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపింది. కేసును సీబీఐకి సిఫార్సు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది.
‘ఫార్ములా-ఈ’పై ఏసీబీ ఎైంక్వెరీ
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ వాడుతున్న మరో డైవర్షన్ అస్త్రం ఫార్ములా -ఈ రేస్. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన రేసింగ్ కోసం కేటీఆర్ ప్రోద్బలంతో యూకేకు చెందిన కంపెనీకి హెచ్ఎండీఏ రూ.54.88 కోట్లు చెల్లించిందనేది ప్రధాన ఆరోపణ. 2024 డిసెంబర్ 9న హైదరాబాద్ కలెక్టర్ ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికారులు కేటీఆర్‌ను 2025 జనవరి, మార్చిలో రెండుసార్లు విచారించారు.
సుమారు 72 గంటలపాటు 60 ప్రశ్నలు సంధించారని సమాచారం. ఆయనతోపాటు అధికారులు అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని సైతం విచారించారు. విచారణ అనంతరం కేటీఆర్ తాను ఏ తప్పూ చేయలేదని, అవసరమైతే నార్కో అనాలసిస్ పరీక్షలకూ సిద్ధమని ప్రకటించారు. తప్పు రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టంచేశారు. ఏసీబీ స్పెషల్ కోర్టుకు సైతం హాజరై వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ తేల్చలేక, సోషల్ మీడియాలో మాత్రం దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నది.
ధరణి పోర్టల్‌పై సెట్
బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది ఎకరాలను తారుమారు చేసిందని కాంగ్రెస్ ఎన్నికల ముందు నుంచీ ఆరోపిస్తున్నది. ఈ అంశంలో విచారణ కోసం 2026 జూలై 25న ఐపీఎస్ అధికారి డీజీ చారుసిన్హా నేతృత్వంలో ఏడుగురితో స్పెషల్ ఎైంక్వెరీ టీమ్‌ను (సెట్) ఏర్పాటుచేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఇరికించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఆ ముగ్గురితోపాటు ఇతర బీఆర్ఎస్ కీలక నేతలు అక్రమాలకు పాల్పడ్డట్టు రుజువు చేయలేకపోయారు. కానీ ప్రభుత్వ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వేసిన కమిటీలు, కమిషన్ల వివరాలివే
1) కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ : 2024 మార్చి 13
ఆరోపణలు : కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్, అధికారులే లక్ష్యం
ప్రస్తుత స్థితి: 114 మందిని విచారించారు. 2025 జూన్‌లో కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు.
2) ఫోన్ ట్యాపింగ్‌పై సిట్: మార్చి 2024
ఆరోపణలు: కాంగ్రెస్, బీజేపీ నేతలు, సినిమా ఆర్టిస్టులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, జడ్జిలు, ఇతర ప్రముఖుల ఫోన్లను కేటీఆర్, హరీశ్‌రావు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తదితరులు ట్యాప్ చేశారని ఆరోపణ.
ప్రస్తుత స్థితి : చివరిగా 2026 జనవరిలో కేటీఆర్‌ను జూబ్లీహిల్స్ ఠాణాలో ఏడు గంటలపాటు సిట్ విచారించింది.
3) విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై: జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్
ఆరోపణలు : ఛత్తీస్‌గఢ్ నుంచి అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్‌లో అవకతవకలు.
4) ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు – 2024 డిసెంబర్లో ఏసీబీ విచారణ
ఆరోపణలు : కేటీఆర్ హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసు కోసం హెచ్ఎండీఏ నుంచి రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి క్యాబినెట్ అనుమతి లేకుండా పంపారని ఏసీబీ కేసు నమోదు. ఈడీ సైతం విచారణ. కేటీఆర్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
5) బీఆర్ఎస్ నేతల కుటుంబ భూములపై – ఐఏఎస్ అధికారి దేవసేన నేతృతంలో ప్రత్యేక కమిటీ. 2026 సెప్టెంబర్ 24న అధికారుల కమిటీ- సీఎస్ జాజు ఉత్తర్వులు
6) ధరణి పోర్టల్, భూముల సామ్ ఆరోపణలపై సెట్. ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది ఎకరాల రికార్డులను తారుమారు చేశారని ఆరోపణలు. రెవెన్యూ శాఖ విచారణ చేస్తున్నది. కొంతమంది తహసీల్దార్లను సస్పెండ్ చేశారు.
7). పాలమూరు-రంగారెడ్డి, డ్రగ్స్ కేసులు వీటిపై కూడా విజిలెన్స్ విచారణ నడుస్తున్నది. ఇప్పటివరకు చార్జిషీట్ వేసింది 2 కేసుల్లోనే (ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ). మిగిలినవి నివేదిక దశలో ఉన్నాయి.
బీఆర్ఎస్ నేతల భూములపై కమిటీ
22-ఏ పేరిట సర్కార్ పెద్దలు సాగించిన అక్రమ వ్యవహారం గుట్టురట్టు కావడంతో ప్రభుత్వం సరికొత్త డైవర్షన్ డ్రామాలకు తెరలేపింది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను అకారణంగా బయటకు పంపించి సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి ఏకపక్షంగా బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంగుల, పల్లా, పైలెట్ రోహిత్‌రెడ్డి తదితరులు ప్రభుత్వ, అసైన్డ్ స్థలాలను కబ్జా చేశారని ఆధారరహితంగా ఆరోపణలు చేశారు. ఏకంగా కేసీఆర్ వ్యవసాయ భూమిలో అధికారులతో సర్వే చేయించారు. ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అసైన్డ్ భూమిలేదని తేలడంతో రూటు మార్చారు. తాజాగా కేసీఆర్ ఫ్యామిలీ భూములపై విచారణకు ఐఏఎస్ అధికారి శ్రీదేవసేన నేతృత్వంలో కమిటీ వేశారు. విచారణ పరిధిలోకి కేవలం బీఆర్ఎస్ నేతల భూములనే తీసుకురావడం..అధికార పార్టీ పెద్దల భూములు, ఆస్తుల వ్యవహారాలను చూసీచూడనట్టు వదిలేయడాన్ని బట్టి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
తాగే నీళ్లపైనా అక్కసు
విచారణ కమిటీలు, కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. చివరికి ప్రజలకు మంచినీరందించే మిషన్ భగీరథ పథకాన్ని కూడా వదల్లేదు. ఈ పథకం అమల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కానీ మూడేండ్లలో ఎలాంటి అక్రమాలనూ తేల్చలేదు. గత ప్రభుత్వంలో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో అక్రమాలకు తెరలేపిందని ఆరోపిస్తూ విజిలెన్స్ విచారణ చేపట్టింది. కానీ కొందరు రైస్మిల్లర్లపై చర్యలు తీసుకొని వదిలేసింది.