హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు (Assembly Session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, నివాళులర్పిస్తారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభ సంతాపం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెడతారు. మరోవైపు, శాసనమండలిలోనూ ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ టి రత్నాకర్, ఎం రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానం తర్వాత సభను వాయిదా వేయనున్నారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ఆధ్వర్యంలో జరుగనున్న బీఏసీ సమావేశంల్లో ఎన్ని రోజులు సభలను నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ కానుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవోకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తున్నది. కాగా, ఈ సమావేశాలను సాధారణ వర్షాకాల సమావేశాలుగా కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించే ప్రత్యేక సమావేశాలుగా మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టి ప్రభుత్వం తరఫున చర్చను ప్రారంభించే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ప్రతిపక్షాలకు సమయం ఇచ్చి ఒకటిరెండు రోజుల్లోనే చర్చను ముగించే యోచనతో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా మూడు నుంచి అయిదు రోజులకు మించకుండా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.