భారత రాష్ట్ర సమితి సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 119 నియోజకవర్గాల్లో పార్టీ సభలను నిర్వహించి.. గులాబీ బలగం బలాన్ని చాటింది. ఈ నియోజకవర్గ ప్లీనరీల్లో 4 లక్షల మంది ప్రతినిధులు పాల్గొనడం ఓ రికార్డు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఊరూరా గులాబీ జెండా ఎగిరింది. ప్రతి ఊరిలో పతాకావిష్కరణ చేసిన అనంతరం నాయకులు నియోజకవర్గ సభలకు తరలివెళ్లారు. శ్రేణుల్లో ఉత్సాహం, ఉత్తేజం పొంగిపొర్లింది. ‘దేశ రాజకీయ చరిత్రలో ఈ సభలు అరుదైన మైలురాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాలుగు లక్షల మంది క్రియాశీల కార్యకర్తలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాల విషయంలో నిర్మాణాత్మక సందేశం అందింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
BRS | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేరోజు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించి తెలంగాణలో తనకు పోటీయే లేదని మరోసారి స్పష్టంచేసింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలు మంగళవారం ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. 4 లక్షల మంది ముఖ్య కార్యకర్తలతో సభలు హోరెత్తాయి. గ్రామ గ్రామానా, పట్టణ వార్డులు, డివిజన్లలో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం ఉదయాన్నే గ్రామాల్లో జెండాలు ఎగురవేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు.. అక్కడి నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యారు. సభలో మొదటగా అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు.
మంత్రులు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో, హరీశ్‌రావు సిద్దిపేట, గజ్వేల్ సభల్లో పాల్గొన్నారు. ఇతర మంత్రులు వారివారి నియోజకవర్గాల సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభల్లో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి, లోతుగా చర్చించి ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వ విజయాలను బలంగా చెప్తూనే.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలకు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్ చార్జిలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ బాధ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభలు హోరెత్తాయి. సభలకు హాజరైన కార్యకర్తలు, నాయకులకు రుచికరమైన భోజనాలు వడ్డించారు.
తీర్మానాలు ఆమోదం
గత 9 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిపై, నిధుల కేటాయింపుల్లో వివక్ష తదితర అంశాలపై సభల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్లమెంట్ కొత్త భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, సింగరేణిని ప్రైవేటు పరం చేయవద్దని, బొగ్గు గనుల వేలం నిలిపివేసి సింగరేణికి కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, విభజన హామీలను నెరవెర్చాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, బీజేపీ చెప్పినవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేయాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు.
పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు: కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలను అద్భుతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో క్రమశిక్షణతో సభలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, పార్టీ పరిశీలకులకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు నాలుగు లక్షల మంది క్రియాశీల కార్యకర్తలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాల విషయంలో నిర్మాణాత్మక సందేశం అందిందని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఈ సభలు అరుదైన మైలురాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా తీర్మానాల రూపంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన విసృ్తతమైన చర్చ జరిగిందని చెప్పారు.