హైదరాబాద్, ఆగస్టు31 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285(ఏ)ను తొలగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆదివారం ఆమోదించింది. స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50శాతం సీలింగ్‌కు లోబడి పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 285(ఏ)ను గతంలో చేర్చారు. ప్రస్తుతం ఆ సెక్షన్‌ను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు-2025ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
మంత్రి సీతక్క బిల్లును ప్రవేశపెట్టగా దానికి అన్నిపార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆమోదం పొందింది. మున్సిపల్ చట్టంలోనూ పొందుపరిచిన సీలింగ్‌కు సవరణ చేసే బిల్లుకు సైతం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నేడు ఈ బిల్లులపై కాంగ్రెస్ మంత్రులు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు.