PM Fasal Bima | హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ): విఫల పథకంగా ముద్రపడిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ వెంట కాంగ్రెస్ సర్కారు పరుగులు పెడుతున్నది. ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని భావించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా మరో ఆరు రాష్ర్టాలు ఈ పథకం అమలుకు ససేమిరా అన్నాయి.
రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే కేసీఆర్ సర్కారు కూడా ఈ పథకం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని బయటకు వచ్చింది. దీనివల్ల రైతులకన్నా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకే అధిక ప్రయోజనం జరుగుతుందన్నది ఆయా రాష్ర్టాల ఆరోపణ. అయినా సరే, ఆ పథకం అమలుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. రాష్ట్రం మళ్లీ ఫసల్ బీమా పథకంలో చేరుతుందని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై వ్యవసాయ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
కంపెనీలకు రూ. 544 కోట్ల లాభం
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 2016 వానకాలం నుంచి కేంద్రం అమలు చేస్తున్నది. పంటల బీమా కింద కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతులు కూడా తమ వంతు వాటాను చెల్లిస్తారు. 2016 నుంచి 2020 వరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ. 2,415.88 కోట్లు చెల్లించారు. పంటనష్టం కింద రైతులకు ఆయా కంపెనీలు చెల్లించిన మొత్తం రూ. 1,871.54 కోట్లు మాత్రమే. ఈ లెక్కన చూసుకుంటే కంపెనీలు రూ. 544.34 కోట్ల మేర లాభపడ్డాయి.
ప్రచార యావ
అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని అమలుచేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి సొంతంగా పటిష్టమైన పంటబీమా పథకాన్ని అమలుచేస్తున్న పశ్చిమబెంగాల్‌కు అధికారులను పంపి అక్కడి విధానాన్ని అధ్యయనం చేసి ఇక్కడా అమలు చేస్తామని ప్రకటించారు.
కానీ, అంతలోనే ఫసల్ బీమా పథకాన్ని తెరపైకి తీసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సొంతంగా పంటబీమా పథకాన్ని అమలుచేస్తే మోయలేని ఆర్థికభారం పడుతుందని భావించిన ప్రభుత్వం ఫసల్ బీమాను ఎంచుకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీ మేరకు పంటబీమాను అమలు చేశామని చెప్పుకోవడానికి తప్ప దీనివల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
10 మందిలో ముగ్గురికే మేలు
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇందులో చేరింది. రైతు ప్రయోజనాలకు ఈ పథకం పూర్తి విరుద్ధంగా అమలవుతున్నదని ఆ తర్వాత గ్రహించిన ప్రభుత్వం 2020లో దాని నుంచి బయటకు వచ్చింది. 10 మంది రైతులు ప్రీమియం చెల్లిస్తే ముగ్గురికి మాత్రమే ప్రయోజనం చేకూరేది. 2019-20లో తెలంగాణలో 10.34 లక్షల మంది ప్రీమియం చెల్లిస్తే, 3.24 లక్షల మందికి మాత్రమే నష్ట పరిహారం అందింది.
అదికూడా అరకొరగానే. ఇలా నాలుగేండ్లలో మొత్తం 38.38 లక్షల మంది కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తే, 12.33 లక్షల మందికి మాత్రమే పరిహారం అందింది. అంటే సుమారు 26 లక్షల మంది రైతుల సొమ్ము, వీరి తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన సొమ్ము ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల జేబుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ పథకం వల్ల రైతుల కన్నా కంపెనీలకు ఎక్కువ లాభం జరుగుతున్నదని భావించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పథకం నుంచి బయటకు వచ్చింది.
కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ప్రత్యేక పంటల బీమా పథకాన్ని చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది రైతులుంటే ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించిన రైతుల సంఖ్య ఎప్పుడూ 10 లక్షలు దాటలేదు. అంటే మిగిలిన 50 లక్షల మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. దీనినిబట్టి ఈ పథకంపై రైతుల్లో ఏ మాత్రం నమ్మకం లేదని స్పష్టమవుతున్నది.
ఒక్కో రాష్ట్రం బయటకు
ఫసల్‌బీమా యోజన పథకం ప్రారంభించినప్పుడు రైతుల మేలు కోరి తెలంగాణలానే పలు రాష్ర్టాలు అందులో చేరాయి. సీజన్లు గడిచేకొద్దీ అందులోని డొల్లతనం బయటపడడంతో రాష్ర్టాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ప్రధానమంత్రి సొంతరాష్ట్రం గుజరాత్‌తోపాటు కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, పశ్చిమబెంగాల్, బీహార్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రలు బయటకు వచ్చేశాయి. ఫసల్ బీమా కంటే తాము సొంతంగా అమలుచేస్తున్న పథకం వల్లే ఎక్కువమంది రైతులకు మేలు జరిగిందని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పడం ఈ పథకం ఎంత వ్యర్థమో చెప్పకనే చెప్పింది.
మార్పులు చేస్తుందా?
ఫసల్ బీమాలో తిరిగి చేరాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పాత పద్ధతిలో అమలు చేస్తుందా? లేదంటే మార్పులు చేస్తుందా? అన్న చర్చ మొదలైంది. మార్పులు చేయకుంటే రైతులకు ఎలాంటి మేలు జరగదని నిపుణులు చెప్తున్నారు. ప్రీమియం చెల్లింపును తగ్గించడంతో పాటు గ్రామ యూనిట్‌గా పంట నష్టాన్ని అంచనా వేసే విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అవసరమైతే రైతుల ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫసల్ బీమాను పక్కనపెట్టి పశ్చిమ బెంగాల్ మాదిరిగా సొం తంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఫసల్‌బీమాతో రైతులకు మేలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
పంటనష్టం అంచనాలో అశాస్త్రీయ విధానాలు
ఈ పథకంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అనుసరిస్తున్న విధానాలు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాన్యువల్ విధానంలో నిర్వహించే క్రాప్ కటింగ్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో మండలాన్ని యూనిట్ తీసుకోవడం వల్ల ఆయా మండలాల్లో కొన్ని గ్రామాల్లో వివిధ కారణాలతో పంటనష్టం జరిగితే నిబంధనలను సాకుగా చూపి ఆ గ్రామాల్లో నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు.