కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన అధికారులు.. వాటి ప్రారంభోత్సవాల్లో సైతం ప్రొటోకాల్ పాటించడం లేదని, స్థానిక ఎమ్మెల్యేనైన తనకు కనీసం సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 5న రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ప్రొటోకాల్ పాటించకుండా ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించారని, ఎలాంటి అర్హతలేని నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించిన రెబ్బెన ఎంపీడీవో, తిర్యాణి హౌజింగ్ ఏఈలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా ఎన్నిసార్లు అడిగినా.. అధికారులు ఇవ్వడం లేదని, అదే కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఇస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ ఎమ్మెల్యేనైన తనపై అధికారులు చిన్నచూపు చూపడం సరికాదని, ప్రొటోకాల్ పాటించని అధికారులను సస్పెన్షన్ చేసే వరకూ ధర్నా విరమించేది లేదని పట్టుబట్టారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం 4.30 గంటల వరకు సాగింది. అదనపు కలెక్టర్ డేవిడ్ జోక్యం చేసుకొని ధర్నా విరమించాలని కోరగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా ఇవ్వడంతో పాటు ప్రొటోకాల్ పాటించని అధికారులపై సస్పెన్షన్ వేటువేస్తేనే ధర్నా విరమిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో ప్రొటోకాల్ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను తెప్పించి కోవ లక్ష్మికి ఇచ్చారు. తిర్యాణి, రెబ్బెన ఎంపీడీవో, హౌసింగ్ ఏఈపై విచారణ జరిపిస్తామని, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించేలా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ధర్నా విరమించారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు పదేపదే ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.